రెండోరోజూ బంద్ ప్రశాంతం
=సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర
=నిలిచిన బస్సులు
= స్వచ్ఛందంగా మద్దతిచ్చిన వ్యాపారులు, ఉద్యోగులు
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు సమైక్యవాదులు శనివారం నిర్వహించిన రెండోరోజు బంద్ విజయవంతమైంది. ఉదయం ఆరుగంటల నుంచే వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్యవాదులు, టీడీపీ నాయకులు రోడ్లపైకి వచ్చి బంద్‌కు సిద్ధమయ్యారు. సమైక్యవాదులు విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ వద్ద బైఠాయించడంతో బస్సులు బయటకు రాలేదు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మాత్రమే బస్సులు తిరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ జెండాలను చేతపట్టుకుని బైక్‌లపై తిరుగుతూ దుకాణాలు మూయించారు. నగరంలో సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు.
జిల్లాలోనూ....
సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. వైఎస్సార్ సీపీ నేతలు, సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి దుకాణాలను మూయించి, ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసేశారు. ఉద్యోగులు బంద్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గుడివాడలో ఏరియా ఆస్పత్రి సిబ్బంది విధులు పక్కన పెట్టి కొద్దిసేపు ఆందోళనలు చేపట్టారు. జగ్గయ్యపేటలో వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు కళ్లకు గంతలు కట్టుకొని గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో శనివారం రాత్రి కాగడాల ర్యాలీ నిర్వహించారు. మైలవరంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్‌బాబుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్సార్సీపీ, టీడీపీ విడివిడిగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి, రహదారిపై నాయకులు, కార్యకర్తలు భోజనాలు చేశారు.
తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌కు నియోజకవర్గ కోఆర్డినేటర్ వల్లభాయ్ నాయకత్వం వహించారు. నూజివీడులో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మేకా ప్రతాప్ అప్పారావు నేతృత్వంలో గంటసేపు ధర్నా చేశారు. కైకలూరులో వైఎస్సార్సీపీ, టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. చల్లపల్లిలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణను కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.