కాంగ్రెస్ రాజీవ్‌తోనే నాశనం!
వాషింగ్టన్: వివిధ దేశాల్లో జరిగే రాజకీయ పరిస్థితులను సమీక్షించి ఓ అంచనాతో రహస్య నివేదికలు తయారు చేసుకోవటం పలు దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలకు అలవాటైన పనే. భారత ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనూ అమెరికా ఐబీ వర్గాలు ఇలానే ఓ నివేదికను రూపొందించాయి. ఆ నివేదిక ఇప్పుడు బహిర్గతం కావడంతో సంచలనంగా మారింది.
ఇందిరాగాంధీ హత్యకు దాదాపు రెండేళ్ల ముందే 1983 జనవరి 14న ఈ నివేదికను యూఎస్ కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ) తయారు చేసింది. ఒకవేళ అనివార్య కారణాలతో ఇందిర మరణిస్తే ఆమె వారసుడిగా రాజీవ్‌గాంధీ పగ్గాలు చేపడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతుందని అందులో నివేదించింది.
‘రాజీవ్‌గాంధీకి రాజకీయ పరిజ్ఞానం అంతంత మాత్రమే. ప్రజలను ఆకర్షించటంలోనే కాదు. జూనియర్ కావటంతో పార్టీని సమర్థవంతంగా నడపటంలోనూ విఫలమై తీరతారు.’ అని పేర్కొంది. ఆయనకు ఇందిరాగాంధీలా రాజకీయ చతురత లేదని, ఒకవేళ రాజీవ్ ప్రధాని అయితే మాత్రం ఆ అధికారాన్ని ఎంతో కాలం నిలబెట్టుకోలేరని, రాజకీయ అస్థిరత ఏర్పడి ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తి పార్టీ ఉనికికే ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది.
అంతేకాకుండా ఆ సమయంలో ఇందిరాగాంధీ కేబినెట్లో మంత్రులుగా ఉన్న ఆర్ వెంకట్రామన్, పీవీ నరసింహరావు, ప్రణబ్ ముఖర్జీ, ఎన్డీ తివారీలు ఆ హోదాకు రైట్ ఛాయిస్ అంటూ అభిప్రాయపడింది. ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాఖలైన ఓ పిటిషన్‌కు బదులుగా సీఐఏ ఈ 30 పేజీల నివేదికను ఇండియా ఇన్ ది మిడ్-1980, గోల్స్ అండ్ ఛాలెంజ్ పేరిట బహిర్గత పరిచింది.