'ప్రైవేటు స్థలాల్లో అసభ్యత నేరం కాదు'
ముంబయి: బహిరంగ ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రదేశాల్లో అసభ్యకర చేష్టలకు పాల్పడటం భారతీయ చట్టం ప్రకారం నేరం కాబోదని బొంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన 13మందికి విముక్తి కల్పించింది. గత ఏడాది డిసెంబర్ 12న ముంబయిలోని అంధేరి పరిధిలోని ఓ ఫ్లాట్ లో చుట్టుపక్కలవారికి ఇబ్బంది కలిగేలా కొందరు వ్యవహరించారు. అశ్లీలాన్ని తలపించేలా దుస్తులు ధరించి ఆరుగురు మహిళలు, పీకల దాకా మద్యం తాగి 13 మంది వ్యక్తులు గట్టిగా మ్యూజిక్ పెట్టుకొని నానారచ్చ చేశారని ఓ పాత్రికేయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ దృశ్యాలు కిటికీలో నుంచి అందరికీ కనిపించి ఇబ్బందిని కలిగించాయంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు సెక్షన్ 294 కింద కేసు నమోదు చేశారు. అయితే, దీనిని బాధితులు కోర్టులో సవాల్ చేయగా ఈ సెక్షన్ కింద కేవలం బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని మాత్రమే శిక్షించగలం తప్ప ప్రైవేటు ప్లేస్ లలో వ్యక్తిగత స్థలాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని శిక్షించే వెసులుబాటు లేదని కోర్టు తెలిపింది.