ఆ గుండె.. ఆగింది
♦ గత నెల 28న యశోదాలో సాఫ్ట్వేర్ ఉద్యోగికి గుండె మార్పిడి
♦ శస్త్రచికిత్స చేసిన 12 రోజుల తర్వాత చనిపోయినట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో ఇటీవలే గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న బాధితుడు మృతిచెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుండె పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో అతనికి వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అయితే ఆపరేషన్ జరిగిన 12 రోజుల తర్వాత అతను మృతిచెందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శస్త్రచికిత్స సమయంలో ఎంతో హడావుడి చేసిన ఆస్పత్రి యాజమాన్యం.. బాధితుడు చనిపోయిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రి నుంచి శవాన్ని తరలించడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీనివాసరాజు(50) కొంతకాలంగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్నాడు. 7 నెలల క్రితం గుండెపోటు రావడంతో యశోదా ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించాడు.
అతడిని పరీక్షించిన వైద్యులు.. గుండె పనితీరు పూర్తిగా దెబ్బతిందని నిర్ధారించారు. గుండెమార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. గుండెను దానం చేసే దాత దొరక్కపోవడంతో తాత్కాలికంగా చికిత్స అందించి ఇంటికి పంపారు. కొద్ది రోజులకే మళ్లీ గుండెపోటు రావ డంతో చికిత్స కోసం బంధువులు ఆస్పత్రికి తీసుకురావడంతో వైద్యులు అతడిని అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు. అక్టోబర్ 16న జీవన్‌దాన్‌లో అతని పేరు నమోదు చేశారు. నవంబర్ 24న తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శరవణన్(23) అనే వ్యక్తి బ్రెయిన్‌డెడ్ అయినట్లు 27న వైద్యులు ప్రకటించారు.
శరవణన్ అవయవాలను దానం చేసేందుకు బంధువులు అంగీకరించారు. దీంతో నవంబర్ 28న ఉదయం యశోదా వైద్య బృందం ప్రత్యేక విమానంలో తిరుచ్చి వెళ్లి.. గుండెను సేకరించి అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం 4.28 నిమిషాలకు బేగంపేట చేరుకుంది. అనంతరం 15 మందితో కూడిన వైద్య బృందం ఏడు గంటల పాటు శ్రమించి శ్రీనివాసరాజుకు గుండెను అమర్చింది. శస్త్రచికిత్స తర్వాత గుండె పనితీరు మెరుగుపడినట్లు అతనికి చికిత్స చేసిన ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ ఏజీకే గోఖలే స్పష్టం చేశారు. ఆరు మాసాల క్రితమే శస్త్రచికిత్స చేయించుకోవాల్సిందిగా బాధితునికి సూచించామని, వారు చికిత్సను వాయిదా వేసుకోవడం, అప్పటికే కాలేయం, మూత్రపిండాల పనితీరు మందగించడం వల్ల బాధితుడు కోలుకోలేదన్నారు. అతనిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశామని, అయినా ఫలితం లేకుండా పోయిందని, శస్త్రచికిత్స చేసిన 12 రోజుల తర్వాత అతను మృతిచెందాడని తెలిపారు. ఇదే శస్త్రచికిత్స ఆరు మాసాల ముందు చేయించుకుని ఉంటే ప్రాణాలతో బయటపడే వాడని ‘సాక్షి ప్రతినిధి’కి చెప్పారు.