seemadnhra
-
మేకలతో మేత... కోళ్లతో కూత!
మా తెలుగు సార్ అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే... సమకాలీన అంశాలతో పోలిక చెబుతూ పాఠం మాకు అర్థమయ్యేలా చేస్తారాయన. ఆవ్వాళ్ల సామెతలపై పాఠం చెబుతున్నారాయన. ‘‘సామెత అంటే సామ్యత. అంటే పోలిక. కాబట్టి ఇవ్వాళ్ల ‘అత్తలతో కలిసి అమ్మడం, కోడళ్లతో కలిసి కొనడం’ అనే సామెతను చెబుతూ మీకో పోలిక చూపుతా. అది అర్థమైతే మాకు పాఠం కూడా తేలిగ్గా బుర్రకెక్కుతుంది అన్నారాయన’’ ‘‘అత్తలతో కలిసి అమ్మడం... కోడళ్లతో కలిసి కొనడం అనే దానికి అర్థం చెప్పే ముందర మనమూ అలాంటి ఒక కొత్త సామెత సృష్టిద్దాం. అదేమిటంటే... ‘మేకలతో కలిసి మేయడం... కోళ్లతో కలిసి కూయడం’ అన్నమాట. అంటే ఏమిటీ అర్థం. గుట్టల మీదా, కొండచరియల మీదా ఎప్పుడైనా మేకల్ని చూశారా. తలవంచుకుని తదేకంగా మేస్తూ పోతాయి. అదేపనిగా ఆరగిస్తూ ఉంటాయి. మరో పని చేస్తున్నట్టు కనిపించవు. అలాగే కూత విషయానికి వస్తే కోడి కూడా అంతే. పొద్దున్నే పొదుపుగా ఒకసారి కూస్తుంది అంతే. తెలివైనవాళ్లెవరైనా చేయాల్సిందిదే. అదే పనిగా కూస్తూ తమ శక్తిని వృథా చేసుకోకూడదన్నమాట. ఇక పొద్దున్న కూసే ఒక కూతతోనే తానో యుగకర్తలాగా, కొత్త దినానికి తానూ ఒక ఆహ్వానం పంపినట్టుగా పోజు పెట్టవచ్చు. అలాగే ఇక మేకల్లో కలిశాక చెప్పేదేముంది... మేతే... మేత’ బాగుంది కదా. పాత సామెత అయిన అత్తలతో కలిసి అమ్మడం, కోడళ్లతో కలిసి కొనడం కూడా ఇలాంటిదేనన్నమాట. తాము యుక్తవయసులో ఉన్నప్పటి కొన్ని వస్తువులు అత్తలకు ఇప్పుడు అంత అవసరంగా అనిపించవు. కాబట్టి తమకు అనవసరం అయిన వస్తువులను అమ్మి లాభం కళ్లజూస్తుంటారు. ఇక కోడళ్లు ఎలాగూ కొత్తగా కాపురానికి వచ్చినవాళ్లు కాబట్టి అన్ని విలాస వస్తువులూ తమకు అవసరంలా అనిపిస్తాయి. అత్తలతో కలిసి ఏదైనా వస్తువును అమ్మారనుకోండి. అప్పుడు ఆ లాభంలో వాటా ఖాయం. ఇక కోడళ్లతో కలిసి కొన్నారనుకోండి. ఆ వస్తువు ఎలాగూ తమ వద్దనే పదిలంగా ఉంటుంది. క్లాసులో ఎవరైనా మన సమకాలీన రాజకీయాల్లో జరిగే లైవ్ దృష్టాంతాన్ని చెబుతూ దీనికి ఉదాహరణ ఇవ్వగలరా’’ అని అడిగారు మా తెలుగు సారు. అంతే నేను చెబుతాను సార్ అంటూ లేచాడు మా రాజకీయాల్రావు. అతడి అసలు పేరు రాజారావు. కానీ ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడతాడు కాబట్టి రాజకీయాల్రావు అంటుంటారు అతడిని. ‘‘చెప్పు’’ అని మా సార్ అనగానే తగులుకున్నాడు మావాడు. ‘‘ఇప్పుడు తెలంగాణ తెచ్చిన ఫలానా పార్టీతో కలిస్తే ఆ ప్రాంతంలో ఓట్లు వస్తాయి కాబట్టి అక్కడ పొత్తు కావాలనుకుంటాడు ఓ బాబు. అలాగే సీమాంధ్రలో కలిస్తే ఓట్లకు గండి పడుతుంది కాబట్టి ఏదో వంక చెప్పి ఇక్కడ వద్దంటాడు. అంటే తెలంగాణలో సదరు పార్టీ కాళ్లను కమలాల్లా కళ్లకద్దుకుని, సీమాంధ్రలోకి వచ్చేసరికి అదే పార్టీ పొత్తును కమలాపండు తొక్కలా తీసిపారేస్తాడన్నమాట. ఈ పని చేసేదెవరూ అన్న పొడుపు కథకు జవాబు తెలిసిన వారికి మీరు చెప్పే సామెతతోని సామ్యత ఎవరితోనో చక్క గా అర్థమవుతుంది సార్’’ అంటూ సామెత అర్థాన్ని పొడుపుకథలా వివరించాడు మా రాజకీయాల్రావు. ‘‘భలే చెప్పావు రాజకీయాల్రావ్..’’ అంటూ మెచ్చుకుంటూనే... ‘‘ఇలాంటిదే మరో వాడుకా ఉంది. పనిచేయాల్సి వస్తే తప్పించుకోడానికి దూడల్లో కలిసేదెవరూ, పచ్చగడ్డి మేయాల్సి వస్తే ఎద్దుల్లో కలిసి ఆ ‘పచ్చ’గడ్డి కోసం పాకులాడెదెవరూ, అత్తల సామెతలోలా పొత్తులు కుదుర్చుకునేదెవరు, అందితే జుత్తు-అందకపోతే పొత్తు అనేది ఎవరో తెలిస్తే ఇవ్వాళ్ల మన సామెతల క్లాసు సార్థకమేరా’’ అన్నారు మా తెలుగు సారు. అదెవరో చెప్పుకోండి చూద్దాం. - యాసీన్ -
సిట్టింగ్‌లకే అవకాశం!
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ టికెట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ కాంగ్రెస్‌కు తలనొప్పి వ్యవహారంగా మారింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు పార్టీ ఎంపిక చేసే అభ్యర్థులను ఓడిస్తామని చెబుతుండటం, సమైక్యవాదాన్ని విన్పిస్తున్న నేతలను స్వతంత్రులుగా బరిలో దింపేందుకు ప్రయత్నిస్తుండటంతో అధిష్టానం పెద్దలకు అభ్యర్థుల ఎంపిక చిక్కుముడిగా మారింది. ఇలాంటప్పుడు కొత్తవారిని ఎంపిక చేయడం లేనిపోని ఇబ్బందులకు దారి తీయొచ్చన్న ఆందోళన కూడా నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది. సిట్టింగులనే మళ్లీ బరిలో దించితేనే మేలన్న ఆలోచన అధిష్టానంలో ఉందం టున్నారు. మూడు సామాజికవర్గాలకు సీట్లు! రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న ఆరు రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీలు ఐదుగురున్నారు. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం రీత్యా మూడు స్థానాలే దక్కే అవకాశాలున్నాయి. దాంతో ఒకవేళ సిట్టింగులకే మళ్లీ అవకాశమివ్వదలిస్తే ఐదుగురిలో ఎవరిని ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పదవీ విరమణ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీల్లో ఎస్సీ (నంది ఎల్లయ్య), ఎస్టీ (రత్నాబాయి), మైనారిటీ (ఎంఏ ఖాన్), రెడ్డి(సుబ్బరామిరెడ్డి), వెలమ (కేవీపీ రామచంద్రరావు) సామాజికవరాల్గ వారున్నారు. సిట్టింగులకే టికెటివ్వాలని నిర్ణయిస్తే ఎల్లయ్య, రత్నాబాయి, ఖాన్లకు ఢోకా లేదన్న ప్రచారముంది. కొత్తవారికి అవకాశమివ్వాలకుంటే మాత్రం ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, ట్రైఫెడ్ చైర్మన్ సూర్యానాయక్ ముందు వరుసలో ఉన్నారు. రాహుల్ టీమ్ సభ్యుడైన కొప్పుల రాజు పట్టుబడితే మాత్రం ఆయనకు టికెట్ ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సూర్యానాయక్ పేరును కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ ప్రతిపాదిస్తున్నారు. ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, పీసీసీ మైనారిటీ విభాగం చైర్మన్ సిరాజుద్దీన్, మాజీ మంత్రి రెడ్యానాయక్‌తో పాటు సీమాంధ్రకు చెందిన పలువురు నేతలు కూడా పెద్దలకు దరఖాస్తు పెట్టుకున్నట్టు తెలిసింది. నామినేషన్ల గడువు 28వ తేదీతో ముగుస్తోంది. కాబట్టి సోమవారం సాయంత్రానికి జాబితా విడుదల కావచ్చని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నాలుగో అభ్యర్థిని రంగంలోకి దించుతుందా లేదా అనే విషయంలోనూ సస్పెన్స్ కొనసాగుతోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను పూర్తిగా అధిష్టానం పెద్దలే చూసుకోవడం ఆనవాయితీ. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తనకందిన దాదాపు 25 మంది ఆశావాహుల జాబితాను పెద్దలకు అందజేశారు. అయితే, బొత్స కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్న నేపథ్యంలో పీటముడి మరింతగా బిగుసుకుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఒకరిని, సీమాంధ్ర నుంచి ఇద్దరిని బరిలో దించుతారని పీసీసీ వర్గాలంటున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంపై గుర్రుగా ఉన్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ తెలంగాణ అభ్యర్థికి ఓటేసే అవకాశాల్లేవంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం అధిష్టానం చెప్పిన వారికి ఓటేయాలని నిర్ణయించారని సమాచారం. ఇతరులకు మద్దతివ్వం: బొత్స రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని బొత్స స్పష్టం చేశారు. ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతిచ్చే ప్రసక్తేలేదన్నారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం ఇతర పార్టీల మద్దతు కూడా కోరబోమని ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠి సందర్భంగా చెప్పారు