సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ టికెట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ కాంగ్రెస్‌కు తలనొప్పి వ్యవహారంగా మారింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు పార్టీ ఎంపిక చేసే అభ్యర్థులను ఓడిస్తామని చెబుతుండటం, సమైక్యవాదాన్ని విన్పిస్తున్న నేతలను స్వతంత్రులుగా బరిలో దింపేందుకు ప్రయత్నిస్తుండటంతో అధిష్టానం పెద్దలకు అభ్యర్థుల ఎంపిక చిక్కుముడిగా మారింది. ఇలాంటప్పుడు కొత్తవారిని ఎంపిక చేయడం లేనిపోని ఇబ్బందులకు దారి తీయొచ్చన్న ఆందోళన కూడా నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది. సిట్టింగులనే మళ్లీ బరిలో దించితేనే మేలన్న ఆలోచన అధిష్టానంలో ఉందం టున్నారు.
మూడు సామాజికవర్గాలకు సీట్లు!
రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న ఆరు రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీలు ఐదుగురున్నారు. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం రీత్యా మూడు స్థానాలే దక్కే అవకాశాలున్నాయి. దాంతో ఒకవేళ సిట్టింగులకే మళ్లీ అవకాశమివ్వదలిస్తే ఐదుగురిలో ఎవరిని ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పదవీ విరమణ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీల్లో ఎస్సీ (నంది ఎల్లయ్య), ఎస్టీ (రత్నాబాయి), మైనారిటీ (ఎంఏ ఖాన్), రెడ్డి(సుబ్బరామిరెడ్డి), వెలమ (కేవీపీ రామచంద్రరావు) సామాజికవరాల్గ వారున్నారు. సిట్టింగులకే టికెటివ్వాలని నిర్ణయిస్తే ఎల్లయ్య, రత్నాబాయి, ఖాన్‌లకు ఢోకా లేదన్న ప్రచారముంది. కొత్తవారికి అవకాశమివ్వాలకుంటే మాత్రం ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, ట్రైఫెడ్ చైర్మన్ సూర్యానాయక్ ముందు వరుసలో ఉన్నారు. రాహుల్ టీమ్ సభ్యుడైన కొప్పుల రాజు పట్టుబడితే మాత్రం ఆయనకు టికెట్ ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
సూర్యానాయక్ పేరును కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ ప్రతిపాదిస్తున్నారు. ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, పీసీసీ మైనారిటీ విభాగం చైర్మన్ సిరాజుద్దీన్, మాజీ మంత్రి రెడ్యానాయక్‌తో పాటు సీమాంధ్రకు చెందిన పలువురు నేతలు కూడా పెద్దలకు దరఖాస్తు పెట్టుకున్నట్టు తెలిసింది. నామినేషన్ల గడువు 28వ తేదీతో ముగుస్తోంది. కాబట్టి సోమవారం సాయంత్రానికి జాబితా విడుదల కావచ్చని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నాలుగో అభ్యర్థిని రంగంలోకి దించుతుందా లేదా అనే విషయంలోనూ సస్పెన్స్ కొనసాగుతోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను పూర్తిగా అధిష్టానం పెద్దలే చూసుకోవడం ఆనవాయితీ. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తనకందిన దాదాపు 25 మంది ఆశావాహుల జాబితాను పెద్దలకు అందజేశారు. అయితే, బొత్స కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్న నేపథ్యంలో పీటముడి మరింతగా బిగుసుకుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఒకరిని, సీమాంధ్ర నుంచి ఇద్దరిని బరిలో దించుతారని పీసీసీ వర్గాలంటున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంపై గుర్రుగా ఉన్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ తెలంగాణ అభ్యర్థికి ఓటేసే అవకాశాల్లేవంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం అధిష్టానం చెప్పిన వారికి ఓటేయాలని నిర్ణయించారని సమాచారం.
ఇతరులకు మద్దతివ్వం: బొత్స
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని బొత్స స్పష్టం చేశారు. ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతిచ్చే ప్రసక్తేలేదన్నారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం ఇతర పార్టీల మద్దతు కూడా కోరబోమని ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠి సందర్భంగా చెప్పారు
సిట్టింగ్‌లకే అవకాశం!
Published Mon, Jan 27 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement
Advertisement