రెండు రాష్ట్రాలను మళ్లీ కలుపుతాం
రెండు రాష్ట్రాలను మళ్లీ కలుపుతాం
Published Tue, Mar 11 2014 12:35 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
మా పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర’
మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటన
రాష్ట్రం ఇంకా విడిపోలేదు.. సుప్రీంకోర్టుపై మాకు ఆశ ఉంది
తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్య గోడను ప్రజలే కూల్చేశారు
తెలంగాణ నుంచే ఇలాంటి ఉద్యమం ఆరంభమవుతుంది
రాష్ట్ర విభజనకు చంద్రబాబునాయుడే కారకుడు
గవర్నర్ నరసింహన్ సూపర్‌మేన్ అంటూ వ్యంగ్యాస్త్రాలు
కిరణ్ అధ్యక్షుడిగా 16 మందితో కొత్త పార్టీ కార్యవర్గం
రేపు రాజమండ్రి సభలో పార్టీ గుర్తు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఇంకా విడిపోలేదని.. సుప్రీం కోర్టుపై తమకింకా ఆశ ఉందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్రం విడివడినా తూర్పు, పశ్చిమ జర్మనీలు కలసిపోయిన మాదిరిగానే ప్రజల పోరాటంతో రెంటినీ తిరిగి కలుపుతామని చెప్పారు. ‘‘తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్య 1961లో అడ్డుగోడ కట్టారు.. 1991 నాటికి ప్రజలే దాన్ని కూల్చి ఒకటి చేశారు. ఇక్కడ కూడా అలాగే అవుతుంది.. తెలంగాణ నుంచే ఇలాంటి ఉద్యమం ఆరంభమవుతుంది’’ అని కిరణ్ అభిప్రాయపడ్డారు. బెర్లిన్ గోడ కూల్చినప్పటి ఆ గోడ ముక్కను తన మిత్రుడొకరు తెచ్చారని, ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక దాన్ని తెప్పించానంటూ ఒక చిన్న సంచిలోంచి రాయిముక్కను తీసి చూపించారు. తాను ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ అని.. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలపటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని కిరణ్ ప్రకటించారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లోని తన ప్రైవేటు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొత్త పార్టీ పేరుతో పాటు 16 మందితో పార్టీ కార్యవర్గాన్నీ ప్రకటించారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షుడు కాగా.. వ్యవస్థాపక అధ్యక్షుడిగా చుండ్రు శ్రీహరిరావు, ఉపాధ్యక్షులుగా ఎ.సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బంహరి, జి.వి.హర్షకుమార్, సాకే శైలజానాథ్, పితాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులుగా ఎన్.తులసిరెడ్డి, కేశిరాజు శ్రీనివాస్ (గజల్ శ్రీనివాస్), టి.దొరస్వామి, ఎం.వి.రత్నబిందు, జి.గంగాధర్, కోశాధికారిగా భమిడిపాటి రామమూర్తి, సభ్యులుగా మహ్మద్ అబ్దుల్‌ఖాదిర్, బండి సుధాకర్‌లను నియమించారు. ఈ నెల 12వ తేదీన రాజమండ్రి సభలో పార్టీ గుర్తు తదితర అంశాలను ప్రకటిస్తామని కిరణ్ తెలిపారు. తమ పార్టీలోకి అన్ని వర్గాల ప్రజలు రావాలని, ఉద్యోగ సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ నుంచే విలీన పోరాటం ప్రారంభమవుతుందని పేర్కొన్న కిర ణ్ ప్రకటించిన పార్టీ కార్యవర్గంలో ఆ ప్రాంతం నుంచి ఒక్క కీలక నేత కూడా లేకపోవటం గమనార్హం.
పార్టీ టికెట్ల కోసం దరఖాస్తులు అందాయి...
రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించినందున లగడపాటి రాజగోపాల్‌ను తమ పార్టీ కార్యవర్గంలోకి తీసుకోలేదని, అయితే ఆయన సలహాలు సూచనల ప్రకారం పార్టీ నడుస్తుందని కిరణ్ పేర్కొన్నారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు గురించి మీడియా అడగగా.. ‘‘ఇష్టమున్నదీ, లేనిదీ తెలుసుకున్నాకే ఈ కార్యవర్గాన్ని ఏర్పాటుచేశాం. ఇంకా ఏమైనా ఉంటే తరువాత ప్రకటిస్తాం’’ అని బదులిచ్చారు. తమ పార్టీ తరఫున పోటీచేయడానికి అనేక మంది నుంచి దరఖాస్తులు అందాయన్నారు.
అయితే తాము టికెట్లను అమ్మబోమని, ప్రజల కోసం పనిచేసేవారికే ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ను వీడిన తాను ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ సలహాలు వినాల్సిన పనిలేదన్నారు. టీడీపీకి మద్దతు ఇవ్వాలంటున్న చంద్రబాబు.. రాష్ట్ర విభజనపై తన వైఖరేమిటో ఇప్పటికీ చెప్పలేకపోవటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర విభజనకు ఆయనే ప్రధాన కారణమన్నారు. విలేకరుల సమావేశంలో లగడపాటి రాజగోపాల్, సబ్బంహరి, చుండ్రు శ్రీహరిరావు, తులసిరెడ్డి, నీరజారెడ్డి, వాసిరెడ్డి వరదరామారావు, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
ఆ ‘సూపర్‌మేన్’ ఉండగా ఎన్నికలు ఎందుకు?
రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌పై కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘తెలంగాణలో అన్నీ చేయడానికి ఉన్నారు కదా.. ఇక్కడ ఎన్నికలు ఎందుకు పెడుతున్నారు? గవర్నర్ అన్నీ తానే చేసేస్తానంటున్నారు కదా? ఆ సూపర్‌మేన్ ఉండగా మళ్లీ ఎన్నికలు ఎందుకు? ఆయనకే అన్నీ వదిలేస్తే సరిపోతుంది’’ అని వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement