టీడీపీ.. కాంగ్రెస్మయం
సాక్షి, గుంటూరు: సీమాంధ్రలో టీడీపీ మొత్తం కాంగ్రెస్ మయంగా మారుతోందని మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈ ప్రాంతంలో టీడీపీలో కాంగ్రెస్ పార్టీ విలీనం అయినట్లు కనబడుతోందన్నారు. ఇక్క డ టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేర్చుకునేముందు టీడీపీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవడం లేదం టూ పరోక్షంగా చంద్రబాబుకు చురకలంటించారు. అధికారంలో లేకపోయినా పదేళ్లపాటు టీడీపీ శ్రేణులు ఎన్నో కష్టాలుపడి కాంగ్రెస్కు ఎదురొడ్డి పోరాడారని, మరెంతోమంది తమ ఆస్తులు, ప్రాణాలను పార్టీ కోసం పణంగా పెట్టారని గుర్తుచేశారు.
పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుని ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇతర పార్టీల నాయకులను గ్రేడింగ్, ఫిల్టర్ చేసి తీసుకోవాలని సూచించారు. చేర్పులు, మార్పులు అనేవి అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. పార్టీలోకి చేరేవారి చరిత్ర, అంకితభావం, విశ్వసనీయతను తెలుసుకుని తీసుకోవాల్సిన అవసరం ఉందని కోడెల టీడీపీ అధిష్టానానికి సూచించారు.