మా నాన్న సహకరిస్తారు: సీమాంతో
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ తనకు తానుగా లక్నో పోలీసుల ముందు లొంగిపోయారని ఆయన తనయుడు సీమాంతో రాయ్ తెలిపారు. దర్యాప్తు అధికారులకు తన తండ్రి పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. సుబ్రతారాయ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన నేపథ్యంలో సీమాంతో ఢిల్లీలో హడావుడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈనెల 26నే సుప్రీంకోర్టు ఎదుట హాజరుకావాలని భావించి సుబ్రతారాయ్ 24న ఢిల్లీ వచ్చారని తెలిపారు. అయితే నాన్నమ్మ అనారోగ్యానికి గురవడంతో లక్నోకు తిరిగివెళ్లారని వివరించారు. సుప్రీంకోర్టులో తన తండ్రికి ఊరట లభిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. సుబ్రతారాయ్ కనిపించకుండాపోయారని మీడియాలో వార్తలు రావడం తమకు బాధ కలిగించిందని సీమాంతో పేర్కొన్నారు. తమపై వచ్చిన ఆరోపణలన్నీ త్వరలో వీగిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, నాటకీయ పరిణామాల మధ్య సుబ్రతారాయ్ను ఈ ఉదయం లక్నో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.