రేపు మినీ మహానాడు
- జిల్లా వ్యాప్తంగా నాయకులకు ఆహ్వానం
- టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రాకుల శ్రీనివాసరావు యాదవ్
ఒంగోలు, న్యూస్‌లైన్ : ఒంగోలు దక్షిణ బైపాస్‌లోని సీతారామ ఫంక్షన్ హాలులో ఈ నెల 24వ తేదీ ఉదయం 10.45 గంటలకు జరిగే మినీ మహానాడుకు జిల్లాలోని టీడీపీ నాయకులందరూ తరలిరావాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రాకుల శ్రీనివాసరావు యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం ఎన్టీఆర్ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
టీడీపీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ప్రకటించారు. కుట్రపూరితంగా రాష్ట్ర విభజన చేయబట్టే కాంగ్రెస్ పార్టీ చివరకు ప్రతిపక్ష స్థానాన్ని కూడా పొందలేకపోయిందని విమర్శించారు. ఒంగోలు కార్పొరేషన్ అభివృద్ధి, సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటు, జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం వంటి వాటికి జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దనరావు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, శిద్దా రాఘవరావు కృషి చేస్తారని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ మినీ మహానాడుకు హాజరై జిల్లా పార్టీ ప్రవేశపెట్టే తీర్మానాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. నగర అధ్యక్షుడు యానం చినయోగయ్య యాదవ్ మాట్లాడుతూ 23వ తేదీ సాయంత్రం 5గంటలకు పార్టీ జిల్లా కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి పలు తీర్మానాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మహిళా నాయకురాలు టి.అనంతమ్మ, మైనార్టీ సెల్ నాయకులు పఠాన్ హనీఫ్ఖాన్, మాజీ కౌన్సిలర్ మురళి, కపిల్‌బాషా, బాలిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.