జీవన్‌రెడ్డి పక్కన కేసీఆర్
దగ్గరికి వెళ్లి కూర్చొని మరీ ముచ్చటించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: అవకాశం దొరికితే చాలు.. అధికార పార్టీపై విపక్షాలు, విపక్షాలపై అధికార పార్టీ విరుచుకుపడే ఘటనలకు వేదికగా మారిన అసెంబ్లీలో మంగళవారం అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. స్వయానా సీఎం కేసీఆర్ తనసీట్లో నుంచి లేచి, హాలులో అటు చివరన ఉన్న ప్రతిపక్షాల గ్యాలరీకి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి పక్కన కూర్చున్నారు. సీఎం దాదాపు ఐదు నిమిషాల పాటు జీవన్‌రెడ్డితో ముచ్చటించారు.
అయితే తొలుత ప్రశ్నోత్తరాల సమయంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు స్వయం ఉపాధి కార్యక్రమంపై జీవన్‌రెడ్డి వేసిన ప్రశ్నకు సీఎం సమాధానమిచ్చారు. బ్యాంకుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలన్న సూచనను స్వాగతిస్తున్నానని, బ్యాంకుల తీరు బాగాలేదన్న జీవన్‌రెడ్డి మాటలతో ఏకీభవిస్తున్నానని చెప్పారు. దీనిపై కొత్త విధానం రూపకల్పనకు వారంలోనే ఫ్లోర్ లీడర్ల సమావేశం ఏర్పాటు చేసుకుందామని పేర్కొన్నారు. ఆ వెంటనే సీఎం.. జీవన్‌రెడ్డి పక్కన కూర్చుని, ఆయనతో మాట్లాడటంతో సభ్యులందరి దృష్టి అటు వైపు మళ్లింది.