కటకటాల వెనక్కి ఆశారాం
జోధ్‌పూర్: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు, ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును సోమవారం జైలుకు తరలించారు. స్థానిక జిల్లా, సెషన్స్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన కటకటాల వెనక్కి వెళ్లారు. జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో ఆశారాం ఓ పదహారేళ్ల బాలికను లైంగికంగా వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తెల్లని ధోతీ, కుర్తా.. తలపై ఎర్రని టోపీ ధరించిన ఈ 72 ఏళ్ల వివాదాస్పద ఆధ్యాత్మిక గురువును భారీ బందోబస్తు మధ్య పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయన్ను ఈ నెల 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపాల్సిందిగా మేజిస్ట్రేట్ మనోజ్‌కుమార్ ఆదేశించారు. దీంతో ఆశారాంను జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు సుమారు 15 నిమిషాల సేపు ఆయన కోర్టులో గడిపారు. ఆశారాంకు బెయిల్ కోసం ఆశ్రమం తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఒకరోజు పోలీసు కస్టడీలో భాగంగా ఆదివారం అధికారులు ఆయన్ను నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఆయనపై ఆరోపణలకు సంబంధించి తమ వద్ద కీలక సాక్ష్యాధారాలు ఉన్నాయని డీసీపీ అజయ్ లాంబా విలేకరులకు చెప్పారు.
సాధువులేమిటి ఎవర్నైనా శిక్షించాల్సిందే: కాంగ్రెస్
ఒక్క సాధువులనే కాదు.. ఇలాంటి నేరాలకు పాల్పడే వారంద రినీ శిక్షించి తీరాల్సిందేనని కాంగ్రెస్ పేర్కొంది. ఈ తరహా నేరాలపై సాధువుల్ని జైలుకు పంపడం మంచిదేనా? అన్న ప్రశ్నకు ఆ పార్టీ స్పందించింది. చట్టం అందరికీ ఒక్కటేనని, చట్టానికి ఎవరూ అతీతులు కారనేదే సందేశమంటూ ఆశారాం అరెస్టుపై అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి జవాబిచ్చారు.