కొండ చిలువతో సెల్ఫీ తీసుకోబోతే..
సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణంమీదకు తెచ్చింది. అదృష్టవశాత్తూ కొద్దిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రాజస్థాన్లోని మౌంట్ అబు జిల్లా సిరోహిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొండచిలువ కనిపించింది. ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. అధికారులు కొండచిలువను జాగ్రత్తగా పట్టుకున్నారు.
అధికారులు కొండ చిలువను తీసుకెళ్తుండగా ఓ యువకుడు అక్కడికి వచ్చాడు. ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్ కెమెరాలో బందిస్తూ, సెల్ఫీ తీసుకోవాలని ఉత్సాహపడ్డాడు. ఆ యువకుడు కొండ చిలువను పట్టుకున్న అధికారుల పక్కన నిలబడి సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. కొండ చిలువ తల పక్కనే అతను నిలబడ్డాడు. ఇంతలో ఎవరూ ఊహించనివిధంగా కొండచిలువ అతణ్ని కాటేసేందుకు దాడి చేసింది. ఆ యువకుడు కొద్దిలో దాని బారినుంచి తప్పించుకున్నాడు.