రేప్లపై హైకోర్టు ముందు అర్ధనగ్న నిరసన
ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అత్యాచారాలపై కేరళ మహిళలు తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. ఐదుగురు మహిళా కార్యకర్తలు తొలుత నగ్నంగా మారి, తర్వాత కేవలం ఒక వస్త్రాన్ని తమ ఒంటిచుట్టూ కప్పుకొన్నారు. అది కూడా కేరళ హైకోర్టు ఎదురుగా!! 'స్త్రీ కూటైమ' (మహిళా గ్రూప్) అనే దళానికి చెందిన ఐదుగురు మహిళలు దేశ జాతీయ పతాకంలోని మూడువర్ణాలకు ప్రతీకగా ఆకుపచ్చ, తెలుపు, కాషాయరంగు వస్త్రాలను కప్పుకొని అత్యాచారాలను నిరోధించాలంటూ నినాదాలు చేశారు.
ఈ దళంలో మొత్తం 30 మంది మహిళలున్నారు. వీరిలో ఐదుగురు అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేయగా, మిగిలినవారు నినాదాలు ఇచ్చారు. అయితే, కోర్టు ముందు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని, అసభ్యంగా ప్రవర్తించారని, బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ సృష్టించారని పోలీసులు ఈ ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని, తర్వాత వారిని బెయిల్ మీద విడిచిపెట్టారు.