సదర్ ఉత్సవాల్లో అపశ్రుతి
= దున్నపోతు దాడి.. యువకుడి మృతి
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: సదర్ ఉత్సవాల్లో సోమవారం రాత్రి అపశ్రుతి దొర్లింది. ఊరేగింపు కోసం ఉంచిన దున్నపోతు వీరంగం సృష్టించడంతో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మారేడుపల్లి, తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ సరిహద్దుల మధ్య జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మారేడుపల్లికి చెందిన యాదవసంఘం ప్రతినిధి వెంకటేష్‌యాదవ్ ఆధ్వర్యంలో దున్నపోతులతో కూడిన సదర్ ర్యాలీ సోమవారం రాత్రి ఈస్ట్ మారేడుపల్లి నుంచి ప్రారంభమైంది.
బాణసంచా పేళుల్లు, డప్పుచప్పుళ్లు, యువకుల నృత్యాల మధ్య షేనాయ్ నర్సింగ్ హోం సమీపంలోని ముత్యాలమ్మ దేవాలయం వద్దకు చేరింది. అక్కడ కాసేపు ర్యాలీని నిలిపి దున్నపోతులను ఆడించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రెచ్చిపోయిన దున్నపోతు వీరంగం సృష్టించింది. ప్రజల మీదకు ఉరికింది.
ఈ ఘటనలో ఈస్ట్మారేడుపల్లికి చెందిన ముత్యాలు యాదవ్ కుమారుడు అశోక్‌యాదవ్ (35) కడుపులోకి దున్నపోతు కొమ్ములు దూసుకెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. ఉత్సవ నిర్వాహకులు బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు గాంధీ వైద్యులు ధృవీకరించారు. సంఘటనలో మరో ఇద్దరు యువకులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. అటు తుకారాంగేట్ పోలీసులు, ఇటు మారేడుపల్లి పోలీసులు ‘పరిధి’ల గొడవతో ఘటన జరిగిన రెండు గంటల వరకు సంఘటన స్థలానికి రాలేదు.