రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
టీనగర్: విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ దాఖలయిన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు నోటీసులు పంపింది. సీనియర్ న్యాయవాది ఆర్ గాంధీ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈ విధంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచనున్నట్లు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రకటించిందని, ఇందుకోసం గత నెల 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందన్నారు. ఇందులో విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. అయినప్పటికీ చార్జీలు పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. రూ.3.50కు కొనుగోలు చేయాల్సిన విద్యుత్‌ను 12 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని, అందుచేత విద్యుత్ చార్జీలను ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిందని, అయితే ఇంతవరకు ఆ నియామకం జరగలేదని తెలిపారు. ఉన్నతాధికారులే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌లో కూర్చుని విద్యుత్ చార్జీలు పెంచనున్నట్లు ప్రకటించారని తెలిపారు. అందుచేత విద్యుత్ చార్జీల పెంపుపై స్టే విధించాలని కోరారు. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణన్ సమక్షంలో విచారణకు వచ్చింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు, దీనికి సంబంధించి మరో నాలుగు వారాల్లోగా సంజాయిషీ ఇవ్వాలంటూ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్, రాష్ట్ర విద్యుత్ బోర్డు, తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు పంపుతూ ఉత్తర్వులిచ్చారు.