దర్యాప్తు చేస్తే కాల్చేస్తామని మహిళా ఐపీఎస్‌కు బెదిరింపులు
అత్యాచారం కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కొడుకు నారాయణ్ సాయి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారికి బెదిరింపులు వస్తున్నాయి. గాలింపు చర్యలు ఆపాలని, లేదంటే కాల్చేస్తామని ఓ అపరిచితుడు ఫొనోలో హెచ్చరించాడు. ఈ మేరకు సూరత్ ఉమ్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఆశారాం, ఆయన కొడుకుపై ఇద్దరు సోదరీమణులు సూరత్‌లోని వేర్వేరు పోలీసు స్టేషన్లలో అత్యాచార కేసులు దాఖలు చేశారు. ప్రస్తుతం ఆశారాం జైల్లో ఉండగా, నారాయణ్ సాయి పరారీలో ఉన్నాడు. ఆయన కోసం సూరత్ డిప్యూటి పోలీస్ కమిషనర్ శోభా భుటాడె పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు ఉమ్రా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీకే పటేల్ చెప్పారు. కేసు విచారణ కోసం అక్కడికి వెళ్లనున్నట్టు తెలిపారు.