సెహ్వాగ్, గంభీర్‌లకు పరీక్ష
హూబ్లీ: ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సీనియర్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌లకు కఠిన పరీక్ష. జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలంటే కచ్చితంగా రాణించాల్సిన సమయం. ఈ నేపథ్యంలో నేటి (బుధవారం) నుంచి జరగనున్న అనధికార మూడో టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు... వెస్టిండీస్ ‘ఎ’తో అమీతుమీ తేల్చుకోనుంది.
రెండో టెస్టులో డ్రాతో గట్టెక్కిన టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోసారి సెహ్వాగ్, గంభీర్‌లపైనే అందరి దృష్టి నెలకొంది. బ్యాటింగ్‌లో సంచలనాలు సృష్టిస్తే తప్ప ఈ ఇద్దరికి మరో అవకాశం దక్కకపోవచ్చు. గత 30 టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా చేయని వీరూ రెండో మ్యాచ్‌లో 7 పరుగులు మాత్రమే చేయగా... గౌతీ (11 పరుగులు) ఘోరంగా విఫలమయ్యాడు. ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న పేసర్ జహీర్ కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు.
అయితే ఏడాది తర్వాత మ్యాచ్ ఆడటం, రెండో మ్యాచ్‌లో స్లో వికెట్ ఎదురుకావడం వంటి అంశాలతో జహీర్‌పై విమర్శకులు కాస్త వెనక్కి తగ్గినా... వికెట్ తీస్తేనే జట్టులో చోటు ఖాయమనేది సుస్పష్టం. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఈ ముగ్గురు ఏ మేరకు గాడిలో పడతారనేది ఆసక్తికరం. కెప్టెన్ చతేశ్వర్ పుజారా బ్యాటింగ్‌లో సత్తా చాటలేకపోతున్నాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 45 పరుగులు మాత్రమే చేశాడు. అయితే జగదీష్, అభిషేక్ నాయర్, ఉదయ్ కౌల్లు రాణిస్తుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. జట్టులో మార్పులు చేయాలనుకుంటే ఆల్‌రౌండర్ పారస్ డోగ్రా, షెల్డన్ జాక్సన్, ధావల్ కులకర్ణిలకు అవకాశం దక్కొచ్చు. బౌలింగ్‌లో భార్గవ్ భట్, పర్వేజ్ రసూల్‌లు విశేషంగా రాణిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపైనే భారం పడనుంది.
మరోవైపు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న విండీస్ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదని భావిస్తోంది. ఎడ్వర్డ్స్, బ్రాత్‌వైట్, ఫుదాదిన్, దేవ్‌నారాయణ్, జాన్సన్, మిల్లర్లు ఫామ్ కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఉపఖండపు పరిస్థితులను బాగా ఆకళింపు చేసుకున్న స్పిన్నర్లు స్థాయి మేరకు రాణిస్తుండటం విండీస్‌కు లాభిస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ అదే ఊపు కొనసాగితే భారత్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. కనీసం ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా సిరీస్ కరీబియన్ల సొంతమవుతుంది. కాబట్టి హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు.