వైద్యులకు సేవాభావం అవసరం
చినకాకాని(మంగళగిరి రూరల్), న్యూస్‌లైన్: రోగులకు సేవాభావంతో వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ అన్నారు. ఎన్నారై వైద్యశాలలో మంగళవారం అవయవ మార్పిడిపై వైద్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రూరల్ ఎస్పీ జ్యోతిప్రజ్వలన గావించి సదస్సును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆసుపత్రులకు ఎక్కువ మంది రోగులు వస్తే అధిక డబ్బులు వస్తాయని వైద్యులు అనుకోవడం తప్పని, సమాజానికి సేవ చేయాలనే భావన కలిగి ఉండాలని సూచించారు. తల్లి తరువాత ప్రాణం పోసేది వైద్యులు, పోలీసులు మాత్రమేనని చెప్పారు. వైద్యులు ప్రాణాలు పోస్తే, పోలీసులు ప్రాణాలను కాపాడతారన్నారు.
అవయవ దానం గొప్పది : అర్బన్ ఎస్పీ
సదస్సులో అర్బన్ ఎస్పీ జెట్టి గోపినాథ్ మాట్లాడుతూ అవయవదానం ఎంతో గొప్పదానమనే విషయాన్ని వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది విలువైన తమ అవయవాలను, ఒక్కోసారి ప్రాణాలను సైతం కోల్పోతున్నారని చెప్పారు. పేద కుటుంబాలకు అవయవ దానం మేలు చేకూర్చుతుందని, మృతుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందిస్తుందని తెలిపారు. అవయవ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎన్నారై డెరైక్టర్లు డాక్టర్ మంతెన నర్సరాజు, ముక్కామల సుమతి, డాక్టర్ పోలవరపు రాఘవరావు, డాక్టర్ పిన్నమనేని రామకృష్ణ, ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్ సాహెబ్, డాక్టర్ శ్రీలత, డాక్టర్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.