మార్కెట్ బూస్ట్
97 పాయింట్లు అప్
20,464 వద్దకు సెన్సెక్స్
నెల రోజుల గరిష్టమిది
ఎఫ్ఐఐల పెట్టుబడులు ఓకే
మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన పన్ను తగ్గింపులు స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహమిచ్చాయి. లోక్‌సభలో ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన స్వల్పకాలిక బడ్జెట్లో ఆటో, భారీయంత్రపరికరాలు వంటి రంగాలకు ఉపశమనాన్ని కల్పిస్తూ ఎక్సైజ్ డ్యూటీలలో 2-6% మధ్య కోత విధించడం సెంటిమెంట్‌కు బలాన్నిచ్చింది. వెరసి సెన్సెక్స్ 97 పాయింట్లు లాభపడి 20,464 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా 25 పాయింట్లు లాభపడి 6,073 వద్ద నిలిచింది. కాగా, ఉదయం 11.11 ప్రాంతంలో బడ్జెట్ ప్రసంగం మొదలుకాగానే సెన్సెక్స్ 20,339 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకడం గమనార్హం. ఈ ఏడాదికి ద్రవ్యలోటును 4.6%కు కట్టడి చేయడంతోపాటు, కరెంట్ ఖాతా లోటు 45 బిలియన్ డాలర్లకు పరిమితంకానున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
టాటా పవర్ 5% అప్
సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్ 5% పుంజుకోగా, ఆటో షేర్లు ఎంఅండ్ఎం, హీరో మోటో, మారుతీ 2.8-1.4% మధ్య లాభపడ్డాయి. ఈ బాటలో డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ ద్వయం, యాక్సిస్ బ్యాంక్ 2-1% మధ్య పెరిగాయి. అయితే మరోవైపు కోల్ ఇండియా, హిందాల్కో, ఆర్ఐఎల్ 1.5% స్థాయిలో నష్టపోయాయి. ట్రేడైన షేర్లలో 1,373 నష్టపోగా, 1,235 బలపడ్డాయి.