బ్రైడల్ బ్యూటీస్
పెళ్లి... ప్రతి అమ్మాయి జీవితంలో మధురమైన ఘట్టం! అంతటి గొప్ప వేడుకలో తాను అతిలోక సుందరిలా మెరిసిపోవాలని మురిసిపోని అమ్మాయి ఉండదు. ఈ ట్రెడిషనల్ వేడుకలో సెంటరాఫ్ అట్రాక్షన్ అయిన బ్రైడ్... ప్రౌడ్‌గా నిలబడాలంటే డ్రెస్సింగ్‌తోపాటు మేకప్ కూడా కీలకం. ఆ బ్రైడల్ డ్రీమ్ లుక్స్ కోసం... బాలీవుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ సుష్మాఖాన్ చెబుతున్న టిప్స్!
సెలబ్రిటీలకి మేకప్ చేయడం సింపుల్. ఎందుకంటే వాళ్ల స్కిన్‌టోన్ కాన్వాస్‌లా ఉంటుంది. దీంతో... వాళ్లు అందంగా కనిపించేలా చేయడం చాలా ఈజీ. కానీ.. సాధారణ మహిళలకు అసాధారణ లుక్ తీసుకురావడమే ఛాలెంజింగ్. నా దగ్గరికి వచ్చేవారు ట్రెడిషనల్‌గా కనబడాలని చెబుతూనే ఫ్యాషనబుల్‌గా కూడా ఉండాలని అంటుంటారు. మరికొందరు మేకప్ తక్కువైనా ఫర్వాలేదు, నేచురల్‌గా కనిపించాలని కోరుకుంటారు.
పెళ్లిలో ట్రెడిషనల్ టచ్ ఉండాలి. వధువులు మరింత అందంగా మెరిసిపోవాలంటే మోడరన్ హంగులూ కావాలి. అందుకే... బ్రైట్ మేకప్‌ను వినియోగించాలి. కళ్లు... డార్క్ గ్లిటరరీ మెటాలిక్ రీతిలో ఉండాలి. దీనికి విరుద్ధంగా న్యూడ్ సాఫ్ట్ లిప్స్ బాగుంటాయి. నవ వధువులు సిగ్గులొలకాలంటే... షిమ్మరింగ్ బ్యూటీ మేకప్ పర్ఫెక్ట్.
హెవీ మస్కారా అద్దిన ఐ లాష్‌తో పాటుగా కోల్-ఔట్‌లైన్ గీసిన బంగారు వన్నె కళ్లు క్రిమ్సన్ బ్లూసమ్ మేకప్ సొంతం. ఈ మేకప్‌లో మెరిసే ఎర్రటి పెదాలు వధువును సంప్రదాయంగానూ, అందంగానూ చూపిస్తాయి.
మేకప్ అనేది ఆర్ట్. ఐ మేకప్ వేసుకునే సమయంలో కళ్లపై మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. దీంతో కళ్లు మరింత అందంగా కనబడతాయి.
ఐబ్రో షేప్ కోసం వార్మ్ చాకొలెట్, స్లేటీ, గ్రే లేదా నేవీ బ్లూ షేడ్స్ ఉన్న ఐ పెన్సిల్ ఉపయోగిస్తే బెటర్.
ప్రస్తుతం వేసవికాలం కావడంతో పెదాలకు క్రీమీ లిప్స్టిక్స్ ఉపయోగిస్తే బాగుంటుంది. ప్లమ్, బర్గండి, వైన్, కోరల్, బ్రాండ్ షేడ్లు ఉపయోగిస్తే అందమైన పెదాలకు మరింత అందమొస్తుంది. స్కిన్‌టోన్, డ్రెసప్ననుసరించి బ్లషర్ ఉపయోగిస్తే మంచిది.
ఒక్కొక్కరి స్కిన్ టోన్ ఒక్కోరకంగా ఉంటుంది. మేకప్‌కు ముందు అందరూ ఫౌండేషన్ వేసుకోవాలన్న రూల్ లేదు. హైలైటర్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు.
మేకప్ ఎంత వేసుకున్నా... పెళ్లి సమయంలో సహజంగా వచ్చే అందం ప్రధానం. అందుకోసం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు కచ్చితంగా మూడు లీటర్ల నీటిని తాగాలి. జంక్‌ఫుడ్‌ను పూర్తిగా దూరంగా పెట్టాలి. తాజా పండ్లు తినాలి. ఎక్సర్సైజ్ తప్పనిసరి. మంచి నిద్ర మరింత ఎనర్జీనిస్తుంది.
..:: వాంకె శ్రీనివాస్