యాజమాన్య కోటాకు ప్రత్యేక ఎంట్రన్స్
ప్రైవేటు మెడిక ల్ కాలేజీల డిమాండ్‌కు సర్కారు సానుకూలత
సిద్ధమవుతోన్న ఫైలు.. ఈ ఏడాది నుంచే అమలు?
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ యాజమాన్య సీట్లకు ప్రైవేటు వైద్య కళాశాలలు ప్రత్యేక ఎంట్రన్స్ నిర్వహించాలని చేస్తున్న డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫైలు చకచకా కదులుతున్నట్లు తెలిసింది. సీఎం పచ్చజెండా ఊపితే త్వరలో అమలులోకి రానుంది. యాజమాన్య కోటా సీట్లపై ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా అధికారికంగానే ఐదేళ్ల ఎంబీబీఎస్‌లో ఒక్కో సీటుకు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షలకు పైగా వసూలు చేస్తాయి.
అయితే ప్రత్యేక పరీక్ష పేరుతో నిర్ణయించిన మేరకే కాకుండా దొడ్డిదారిన మరింత వసూళ్లు చేస్తారేమోననే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పరీక్ష ప్రైవేటు చేతుల్లోకి వెళితే భర్తీ విధానం ఎలా ఉంటుందోనని విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రవేశ పరీక్షకే విద్యార్థులు తీవ్ర ఆందోళన, ఒత్తిడి పడుతుండగా రెండో పరీక్ష రాయడానికి విద్యార్థులు ససేమిరా అంటున్నారు.
840 సీట్లకు ప్రత్యేక ఎంట్రన్స్...
తెలంగాణలోని మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉండగా, 2,100 సీట్లు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. ఆ ప్రైవేటు సీట్లలో ‘ఎ’ కేటగిరీలోని 50 శాతం సీట్లు (ఫీజు రూ.60 వేలు), ‘బి’ కేటగిరీ 10 శాతం (ఫీజు రూ.2.40 లక్షలు) సీట్ల ను ఎంసెట్ ద్వారా కన్వీనర్ కోటా కిం ద ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మిగిలిన ‘సి’ కేటగిరీ 40 శాతం (840 సీట్లను) యాజమాన్య కోటా కింద ప్రైవేటు కళాశాలలు ఎంసెట్ ఆధారంగానే భర్తీ చేసుకుంటున్నాయి. వీటికే ప్రత్యేకంగా ఎంట్రన్స్ నిర్వహిం చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. గతేడాదే ప్రత్యేక ఎంట్రన్స్‌కు సంబంధించిన డిమాండ్ రాగా అప్పట్లో రాష్ట్ర విభజన తదితర కారణాల వల్ల దీనిని పక్కన పెట్టేశారు.
ప్రభుత్వం నిర్ణయించే సంస్థ ఆధ్వర్యంలోనే ఎంట్రన్స్
ఎంబీబీఎస్ ప్రవేశాలకు ఎంసెట్ తరహాలోనే... అత్యంత నిబద్ధత కలిగిన సంస్థకు అప్పగించి కట్టుదిట్టంగా ఎంట్రన్స్‌ను నిర్వహించే విషయాన్ని సర్కారు ఆలోచన చే స్తోంది. బుధవారం జరిగిన వైద్య ఆరోగ్య అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ ఇద్దరు ముగ్గురు అధికారులను పక్కకు పిలిచి దీనిపై చర్చించినట్లు తెలిసింది. త్వరలో వరంగల్‌లో ఏర్పాటు చేయబోయే ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ఎంట్రన్స్‌ను నిర్వహిస్తే బాగుంటుందని ఆయన అన్నట్లు సమాచారం. దీనివల్ల ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు రూ. 11.50 లక్షలకు మించి వసూలు చేయకుండా ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ముకుతాడు వేయొచ్చని సీఎం అన్నట్లు తెలిసింది.
రెండు పరీక్షలతో భారమే..
ప్రత్యేక ఎంట్రన్స్ వల్ల విద్యార్థులు రెండు పరీక్షలు రాయడం భారంగా మారనుంది. కర్ణాటక తదితర రాష్ట్రాల్లో రెండు పరీక్షలు ఉన్నందున విద్యార్థులు అలవాటు పడతారని అంటున్నారు. గురువారం నాటికి ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్ కోసం 88,350 దరఖాస్తులు వచ్చాయి. ప్రత్యేక ఎంట్రన్స్ నిర్వహిస్తే దాదాపు అదే సంఖ్యలో దరఖాస్తులు వచ్చే వీలుంది. ప్రత్యేక ఎంట్రన్స్‌కు ప్రైవేటు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవడానికే రూ. 10 వేలు వసూలు చేసే అవకాశాలున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉంది.