మంత్రి.. ఇక మాజీనే!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న కేంద్రకేబినెట్ నిర్ణయంతో రాజకీయ నాయకుల హవాకు తాత్కాలిక బ్రేకులు పడనున్నాయి. కేంద్రకేబినెట్ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే మళ్లీ కొత్త ప్రభుత్వం వచ్చేంతవరకు జిల్లాలో పాలనాపగ్గాలు చేతులుమారనున్నాయి. జిల్లా నుంచి మంత్రిమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాంరెడ్డి వెంకటరెడ్డి మాజీ కానుండగా, జిల్లా పాలనా వ్యవహారాల్లో కలెక్టర్ పూర్తిస్థాయిలో కీలకపాత్ర పోషించనున్నారు. అసెంబ్లీ సుప్తచేతనావస్థలోనికి వెళ్లనుండడంతో ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితిలోకి వెళతారు. కానీ వారి పదవులకు ఎలాంటి ఢోకా ఉండదు. ఒకవేళ రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపే ఉత్తర్వుల్లో శాసనసభను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తే మాత్రం ఎమ్మెల్యే పదవులు కూడా పోనున్నాయి.
మంత్రి గారి పదవి గోవిందా...
రాష్ట్ర ఉద్యానవన శాఖా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి పోగొట్టుకోనున్నారు. రాష్ట్రపతి పాలనకు ఆమోదం లభిస్తే రాష్ట్రంలో మంత్రిమండలి రద్దవుతుంది కనుక ఆ మంత్రి మండలిలో సభ్యుడయిన రాంరెడ్డి కూడా ఆ హోదా కోల్పోతారు. జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తొలిసారి వైఎస్ కేబినెట్లో మంత్రిపదవి చేపట్టారు. వైఎస్ రెండోసారి అధికారంలోకి రాగానే మంత్రివర్గంలో చేర్చుకుని సహకార, కార్మిక, ఫ్యాక్టరీలు, బ్రాయిలర్లు మంత్రిత్వ శాఖను అప్పగించారు. అప్పటినుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ఆ శాఖల మంత్రిగా పనిచేశారు.
కిరణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేయడంతో రాంరెడ్డి పోర్టుఫోలియో మారింది. ఈయనకు కిరణ్ హయాంలో ఉద్యానవన, పట్టుపరిశ్రమ,మేఘమథనం మంత్రిత్వ శాఖలను అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే పదవిలో ఉన్న ఆయన రాష్ట్రపతి పాలన వస్తే మాజీ కానున్నారు. మంత్రి హోదాలో ఆయనకు ఉండే ప్రొటోకాల్ రద్దవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఆయన ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతారు.
పూర్తిగా రద్దు కావు...కానీ
మంత్రిమండలి రద్దయినప్పటికీ జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం పదవుల్లో ఉంటారు. ఎందుకంటే అసెంబ్లీ సుప్తచేతనావస్తలోనికి వె ళ్తుందే తప్ప పూర్తిగా రద్దు కాదు. ఎన్నికలు జరిగేలోపు మళ్లీ ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తే గవర్నర్ సభను సమావేశపర్చవచ్చు. అందుకోసం ఎమ్మెల్యే పదవులు రద్దు కావని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇక జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీస్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్సీల పదవుల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఎందుకంటే రాష్ట్రపతి పాలనతో వీరికి సంబంధం లేదు. ఎంపీలు కేంద్రానికి బాధ్యత వహిం చాల్సి ఉండగా, ఎమ్మెల్సీ హోదా కేవలం మండలికి మాత్రమే పరి మితం అవుతుంది. ఇక డిప్యూటీస్పీకర్ రాజ్యాంగబద్దమైన పదవి కనుక సభ రద్దయ్యేంతవరకు ఆ ప దవి కొనసాగుతుందని అధికారవర్గాలంటున్నాయి. ఇక నామినేటెడ్ పోస్టు లు, సర్పంచ్ పదవులకు కూడా ఎ లాంటి ఢోకా ఉండదు. స్థానిక ప్రభుత్వాలు యథావిధిగా పనిచేస్తాయి.
అన్నింటికీ ప్రభుత్వ యంత్రాంగమే
రాష్ట్రపతి పాలన వస్తే జిల్లాలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోనుంది. ఇప్పటివరకు రాజకీయ నాయకుల కనుసన్నల్లో సాగిన పాలనా వ్యవహారాలన్నీ పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం చేతుల్లోకి వెళ్లిపోతాయి. రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పూర్తిగా జిల్లాలో పాలన సాగిస్తారు. రాజకీయ పలుకుబడులకు బ్రేకులు పడతాయి. పాలన వ్యవహారాల్లో కలెక్టర్ నిర్ణయమే ఫైనల్ కానుంది. ఆయనతో పాటు ఇతర అధికారులపై రాజకీయ నాయకుల ప్రమేయం కానీ, పెత్తనం కానీ ఉండదు.
ఏ నిర్ణయమైనా కలెక్టర్ తీసుకోవాల్సిందే. ఆయన నేరుగా గవర్నర్‌కే జవాబుదారీగా ఉంటారు. ప్రజల సమస్యల పరిష్కారం కూడా కలెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. అయితే, మాజీమంత్రులు, ఎమ్మెల్యేల హోదాలో ప్రజాప్రతినిధులు కూడా ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టర్, ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు సిఫారసులు పంపవచ్చు. మళ్లీ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువు తీరినా, రాష్ట్రపతి పాలనను ఎత్తివేసినా పాత పరిస్థితులు పునరుద్ధరింపబడతాయి.