సార్వత్రిక సమ్మెకు మావోయిస్టుల మద్దతు
తెలంగాణ : సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు తలపెట్టిన స్వారత్రిక సమ్మెకు మద్దతునిస్తూ, సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ సిపిఐ (మావోయిస్టు) పార్టీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
నిత్యావసర ధరలను అదుపు చేయడం, కార్మిక చట్టాల అమలు, కార్మికులందరికీ సామాజిక భద్రత, రైల్వేలో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ డిమాండ్లతో గత ఏడాది సెప్టెంబర్2న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టారు. ఏడాది గడిచిన ఈ డిమాండ్లకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం చర్యలను తీసుకుందని ఆరోపించారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో దేశంలో నిరుద్యోగ సమస్య, పేదరికాన్ని మరింత పెంచి ప్రజల బతుకుల్ని దుర్భర స్థితిలోకి నెట్టివేస్తున్నాయన్నారు. పెట్టుబడుదారులకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం చట్టాలను సవరించాలనుకుంటున్నదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రప్రభుత్వ విధానాలకు అనుకూలంగానే తమ విధానాలను అమలు చేస్తోందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఓడించేంత వరకు శ్రామిక శక్తిని ప్రదర్శించాలని లేఖలో పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం నీటి బుడగలుగా మార్చారన్నారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులతో ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలన్నారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు సాధించుకునేంత వరకు తమ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాలు పరిరక్షించేందుకే ఈ ప్రభుత్వాలు దళారులుగా మారుతున్న దానికి వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలన్నారు. విప్లవోద్యమంపై సాగుతున్న ప్రభుత్వ ఫాసిస్టు దమనకాండను కూడా వ్యతిరేకించాల్సిందిగా లేఖలో కోరారు.