సెప్టెంబర్ 2 సమ్మెతో కేంద్రం దిగిరావాలి
ఉద్యోగ, కార్మిక, అనుబంధ సంఘాల పిలుపు
ముకరంపుర : అఖిలభారత కేంద్ర కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 2న తలపెట్టిన సార్వత్రిక సమ్మెతో కేంద్రం దిగిరావాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మంగళవారం స్థానిక ప్రెస్భవన్లో టీఆర్ఎస్కేవీ, సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘాల ఐక్యవేదిక సన్నాహాక సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్కేవీ బొల్లంపల్లి ఐలయ్య, సీఐటీయూ జనగాం రాజమల్లు, ఏఐటీయూసీ పైడిపల్లి రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రూప్సింగ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్మికుల గొంతు నొక్కితే పుట్టగతులుండవని హెచ్చరించారు. సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదానికి కార్మికవర్గం కదిలిరావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ కార్యదర్వి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ నెలకు రూ.18 వేల జీతాలు లేకుంటే కార్మికులు బతకలేరని నిర్ధరించిన బీజేపీ ప్రభుత్వం.. వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పురోగతి సాధించడంలో కీలకపాత్ర పోషించే కార్మికులు అర్దాకలితో అలమటిస్తుంటే కేంద్రం పెట్టుబడుల పేరుతో ధనికవర్గాలకు కొమ్ము కాస్తోందని ఏఐటీయూసీ నేత యేసురత్నం అన్నారు. నాయకులు తిరుపతి, దావు రాజమల్లు, జి.శంకర్, కె.మధునయ్య, ఎన్.లక్ష్మి, రవి, టేకుమల్ల సమ్మయ్య తదితరులున్నారు.