న్యాయం చేస్తారా.. చావమంటారా..?
► శేరిలింగంపల్లి ఎమ్మార్వో ఆఫీసు వద్ద హైడ్రామా
► కిరోసిన్ డబ్బాలతో కార్యాలయంలో హల్చల్
హైదరాబాద్ (చందానగర్): న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇచ్చారని కోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో బాధితులకు న్యాయం చేయాలని న్యాయమూర్తి ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని, పలుమార్లు ధర్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదనకు లోనైన ముగ్గురు వ్యక్తులు కిరోసిన్ డబ్బాలతో తహశీల్దార్ కార్యాలయంలోకి తలుపులు బిగించుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే శంకర్ అనే యువకుడు సోమవారం అంజయ్యనగర్, సిద్ధిఖీనగర్‌కు చెందిన బాధితులతో కలిసి కిరోసిన్ డబ్బాలతో సహా శేర్లింగంపల్లి తహశీల్దార్ కార్యాలయంలోకి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు.
జేసీ వచ్చి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటామని హెచ్చరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చేవెళ్ల ఆర్డీఓ శ్రీనివాస్ వారిని సముదాయించేందుకు ప్రయత్నించగా, వారు వినిపించుకోలేదు. గతంలో ఎన్నో సార్లు కలెక్టర్ ఈ విషయమై తమరికి ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోనందునే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిందన్నారు. తమకు కేటాయించిన స్థలాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని, వాటిని అడ్డుకునేం దుకు ఎవరూ సహసించడం లేదన్నారు. కోర్టు ఆదేశానుసారం న్యాయం చేయాలని కోరారు.
తలుపులు పగులగొట్టి...
దీంతో తహశీల్దార్ కార్యాలయంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆర్డీవో జె. శ్రీనివాస్, తహశీల్దార్ తిరుపతిరావు, ల్యాండ్ ప్రొటెక్షన్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ నర్సింహ్మరెడ్డి న్యాయం చేస్తామని చెప్పినా శంకర్ వినకపోవడంతో 2 గంటల ప్రాంతంలో వట్టినాగులపల్లి ఫైర్ ఆఫీసర్ మోహన్ ఆధ్వర్యంలో తలుపులను బద్ధలు కొట్టి శంకర్‌తో పాటు మరో ముగ్గురిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెవెన్యూ సిబ్బందే కారణం
తమకు పట్టాలు కేటాయించిన స్థలం కేటాయించకపోవడం వెనక రెవెన్యూ సిబ్బంది హస్తం ఉందని శంకర్ ఆరోపించారు. 58 జీవో ప్రకారం కొందరు రెగ్యులరైజేషన్‌కు దరఖాస్తు చేసుకోగా డబ్బులు ఇవ్వకపోవడంతో తిరిగి తీసుకున్నారని మహిళలు ఆరోపించారు. స్థానికేతరుల నుంచి రూ. 5 లక్షలు తీసుకొని 58 జీవో కింద లబ్ది చేకూర్చరన్నారు.
పొజిషన్లో లేనందునే
ఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ అంజయ్యనగర్, సిద్ధిఖీనగర్‌లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. 1984లో పట్టాలు పంపిణీ చేశారని, అప్పటి నుండి పొజిషన్లో లేనందునే సమస్యలు తలెత్తాయన్నారు. రెవెన్యూ సిబ్బంది అవినీతి పై విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్మాణాలపై నోటీసులు జారీ చేసినట్లు తహశీల్దార్ తిరుపతిరావు తెలిపారు.