రాజధానికి.. చిట్యాల ఎంపీపీ లొల్లి
సాక్షిప్రతినిధి, నల్లగొండ :చిట్యాల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నిక పంచాయితీ చినికి చినికి గాలివానగా మారుతోంది. ఎన్నిక సందర్భంగా జరిగిన గొడవను కాంగ్రెస్ నాయకత్వం సీరియస్‌గానే తీసుకుంది. ఆ రోజు జరిగిన సంఘటనలపై మంగళవారం కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీకి చెందిన 8 మంది ఎంపీటీసీ సభ్యులు రాజధానిలో రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, ఎన్నికల కమిషనర్ రమాకాంత్రెడ్డిలను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నిక రోజు గొడవలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల కటింగులను, వీడియో క్లిప్పింగులను వారు డీజీపీ, ఎన్నికల కమిషనర్‌కు అందజేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీనివాస్, జె.గీతారెడ్డి, మల్లు రవి, డి.కె.అరుణ, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, చిట్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి సహా ఎంపీటీసీ సభ్యులు వారిని కలిశారు. ఇదీ.. జరిగిందిచిట్యాలలో ఈ నెల 5వ తేదీన జరిగిన ఎంపీపీ ఎన్నికల సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అనచరులతో ఎన్నిక కార్యాలయంలోకి ప్రవేశించారు. ఆయనతోపాటు సుమారు 20మంది ఆయన అనుచరులు ఎంపీడీఓ కార్యాలయంలోకి వచ్చారు. వీరితోపాటు టీడీపీ నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డి కూడా ప్రవేశించి కాంగ్రెస్‌కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు రుద్రారపు భిక్షంపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దీంతో ఎంపీడీఓ కార్యాలయంలోకి వచ్చిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సమయంలో భువనగిరి డీఎస్పీ శ్రీనివాస్, ఎమ్మెల్యే వీరేశం మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో ఎంపీడీఓ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను కూడా ధ్వంసం చేశారు. సమావేశ మందిరంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడు కల్లూరి మల్లారెడ్డిపై దాడి జరిగింది. దీంతో కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు చెల్లాచెదురయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్ చెందిన ముగ్గురు ఎంపీటీసీలు, టీడీపీ చెందిన ముగ్గురు ఎంపీటీసీలతో ఎన్నిక నిర్వహించేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. కోరం లేదని ఎన్నికల అధికారి గంగాధర్, ఎంపీడీఓ రాఘవేంద్రరావు ఆభ్యంతరం తెలిపారు. దీంతో చిన్నకాపర్తి ఎంపీటీసీ రుద్రారపు భిక్షం (కాంగ్రెస్)ను బలవంతంగా ఎన్నిక సమావేశంలో కూర్చోబెట్టారు.
ఆనంతరం ఎంపీడీఓ గది వద్ద ఉండిపోయిన ఇద్దరు మహిళ కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు మెండె సుజాత, బండ గిరిజలను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. ఈ పెనుగులాటలో కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యురాలు గిరిజ కిందపడిపోయింది. భయపడిపోయిన ఆమె ఎన్నికలో పాల్గొంటానని సమావేశ మందిరానికి చేరుకున్నారు. అనంతరం టీఆర్ఎస్, టీడీపీ చెందిన ఆరుగురు ఎంపీటీసీలతోపాటు కాంగ్రెస్ చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులతో ఎంపీపీ ఎన్నికను నిర్వహించారు. అది కూడా ఎన్నిక సమయం దాటిపోయాక కలెక్టర్ అనుమతితో ఎన్నికను నిర్వహించారు. ఈ ఎన్నిక జరిగిన ఆనంతరం ఎంపీడీఓ కార్యాల యంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన కాం గ్రెస్ నాయకులపై కూడా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఎన్నిక గొడవల్లో ఎమ్మెల్యే వీరేశంతో పాటు పలువురిపై కేసులు పెట్టారు.
ఇవీ... కేసులు
తన విధులకు ఆటంకం కలిగించారని భువనగిరి డీఎస్పీ శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే వేముల వీరేశం, టీడీపీ నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు. తనపై దాడి చేసి చెయ్యి విరగొట్టారని డీఎస్పీ గన్‌మన్ ఫిర్యాదుతో ఎమ్మెల్యే వీరేశం, టీడీపీ నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డిపై కేసు నమోదైంది.తనను కొట్టి, మానసికంగా వేధించి, అవమానించారని కాంగ్రెస్‌కు చెందిన చిట్యాల-3 ఎంపీటీసీ సభ్యురాలు మెండె సుజాత ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే వీరేశం, కంచర్ల భూపాల్‌రెడ్డి, దుబ్బాక సతీష్‌రెడ్డిలపై మరో కేసు నమోదైంది.
తమపై దాడి చేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్యాల-1ఎంపీటీసీ సభ్యురాలు జిట్ట పద్మ, చిట్యాల-5 ఎంపీటీసీ సభ్యురాలు గంటెపాక ప్రేమలతలు ఎమ్మెల్యే వీరేశం, కంచర్ల భూపాల్‌రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ సంఘటనలపై సోమవారం ఎస్పీ ప్రభాకర్‌రావు, డీఐజీ శశిధర్‌రెడ్డిలు ఎన్నికల రోజు విధులలో పాల్గొన్న ఎంపీడీఓ గంగాధర్, మండల ప్రత్యేకాధికారి గంగాధర్, పోలీసులను విచారణ చేశారు. కాగా, తాజాగా కాంగ్రెస్ నేతలు డీజీపీకి, ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
టీడీపీ నేత కంచర్ల భూపాల్‌రెడ్డి రిమాండ్
చిట్యాల: చిట్యాలలో ఈ నెల 5వ తేదీన నిర్వహించిన ఎంపీపీ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో టీడీపీ నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను రామన్నపేట కోర్డులో రిమాండు చేశారు.