56,634 మంది ఓటర్ల తొలగింపు
కర్నూలులో పూర్తికావచ్చిన ఇంటింటి సర్వే
– కొత్తగా 34,057 ఓటర్ల నమోదు
– నివాసం ఒకచోట.. ఓటు మరోచోట ఉన్న ఓటర్లు 33,189 మంది
– ఆగస్టు మూడవ వారంలో ముసాయిదా జాబితా ప్రకటన
కర్నూలు(అగ్రికల్చర్):
కర్నూలు నగరపాలక సంస్థలో ఓటర్ల జాబితాను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన డోర్ టు డోర్ సర్వే దాదాపు పూర్తయింది. ఆగస్టు నెల మూడవ వారంలో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలు కార్పొరేషన్లో కర్నూలుతో పాటు పాణ్యం, కోడుమారు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లు ఉన్నారు. వీటిల్లో ఇంటింటి సర్వే వల్ల భారీగా బోగస్ ఓటర్లు వెలుగు చూశారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో 41,311 మంది, పాణ్యం నియోజకవర్గం(కల్లూరు)లో 10,368 మంది, కోడుమూరు నియోజకవర్గంలో(కర్నూలు రూరల్) 4955 మంది ఓటర్లను బోగస్‌గా గుర్తించారు. ఇందులో మరణించిన వారు, డూప్లికేట్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు ఉన్నారు. వీరందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. కార్పోరేషన్లో 413 పోలింగ్ కేంద్రాలు ఉండగా 3,03, 303 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇంటింటి సర్వేలో 3,12,803 మంది ఓటర్లను సర్వే చేశారు. కర్నూలు నియోజక వర్గంలో 8,088, కర్నూలు రూరల్ మండలంలో 1,116, కల్లూరు అర్బన్ వార్డుల్లో అత్యధికంగా 24,853 మంది కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇకపోతే 33,189 మంది నియోజకవర్గంలోనే ఓటర్లుగా ఉన్నా.. ఓటర్ల జాబితాలోని అడ్రస్‌ల్లో లేరు. వీరిని ఆయా పోలింగ్ కేంద్రాల్లోకి మార్పు చేయనున్నారు. కర్నూలు నగరపాలక సంస్థలో అస్తవ్యస్తంగా ఉన్న ఓటర్ల జాబితాను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే చేపట్టారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాకు ప్రాధాన్యత ఏర్పడింది.