రూ.145 కోట్ల సబ్‌ప్లాన్ నిధులు మంజూరు
కనిగిరి : ఎస్సీ సబ్ ప్లాన్ కింద రీజియన్‌లోని (ప్రకాశం,నెల్లూరు, గుంటూరు) కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు రూ. 145 కోట్లు నిధులు మంజూరైనట్లు రీజనల్ డెరైక్టర్(ఆర్డీ) అనురాధ తెలిపారు. నగర పంచాయతీ కార్యాలయంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికి 27 పనులకు గాను రూ. 25 కోట్ల మేర పనులు మాత్రమే జరిగాయన్నారు. ప్రకాశంకు రూ. 33.5 కోట్లు, నెల్లూరుకు రూ. 51 కోట్లు, గుంటూరుకు రూ. 61 కోట్లు మంజూరు చేశామన్నారు. 14వ ఆర్థిక సంఘ నిధుల్లో భాగంగా ప్రకాశంకు రూ.15.91 కోట్లు, గుంటూరుకు రూ. 38.83 కోట్లు, నెల్లూరుకు రూ. 21.53 కోట్లు మంజూరు కాగా పనుల పురోగతి తక్కువగా ఉందని వివరించారు. రెండు నెలల్లో పనులు చేపట్టాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. అలాగే 13వ ఆర్థిక సంఘ నిధుల కింద రీజియన్‌లో రూ. 141 కోట్లు మంజూరు కాగా, ఇప్పటికి వరకు రూ. 74 కోట్ల పనులు జరిగాయన్నారు. మిగతా నిధులు రెండు నెలల్లో ఖర్చు చేయాల్సి ఉందని చెప్పారు.
ట్యాక్స్‌ల రూపంలో రూ. 28 కోట్లు
మూడు జిల్లాల్లో రూ. 28 కోట్ల విలువైన ఆస్తి పన్నులు వసూలు చేసినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో రూ. 5 కోట్లు, గుంటూరు రూ. 16 కోట్లు, నెల్లూరులో రూ. 6 కోట్లు వసూలు అరుునట్లు తెలిపారు. పన్నుల కింద రూ. 4.5 కోట్లు వచ్చినట్లు చెప్పారు. కనిగిరి నగర పంచాయతీలో రూ. 27లక్షలు వచ్చినట్లు చెప్పారు.
సీఆర్ఎస్ను సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చిన సర్వీస్ రిజిస్ట్రేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీ అనురాధ కోరారు. బర్త్, డెత్‌ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకుని రసీదు పొందవచ్చన్నారు. దీనిపై ఇప్పటికే కమిషనర్లకు ట్రైనింగ్ ఇచ్చామని, త్వరలో ప్రైవేటు వైద్యులకు కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. పురసేవల యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచి మీ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరారు.