ఇక ఆన్లైన్లో టౌన్ ప్లానింగ్ సేవలు
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: మున్సిపాలిటీల్లో కీలకమైన టౌనింగ్ ప్లానింగ్ సేవలన్నీ త్వరలో ఆన్లైన్లో అందనున్నాయి. ఈ మేరకు తగిన మార్గదర్శకాలను జారీ చేయటానికి మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన టౌన్ సర్వే, ఇళ్లు.. ఇతర భవనాల నిర్మాణానికి అనుమతులు, ప్లాట్ సబ్ డివిజన్, ఛేంజ్ ఆఫ్ ల్యాండ్, లేఅవుట్లకు అనుమతి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్(వీఎల్టీ) విధింపు వంటి సేవలన్నీ ఆన్లైన్లోనే అందుతాయి.
ఆన్లైన్ ఫార్మాట్లో తగిన వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేస్తే పౌరసేవాపత్రం ప్రకారం నిర్దేశిత సమయానికి ధ్రువపత్రాలు జారీ అవుతాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై ఇటీవల సమీక్ష నిర్వహించిన టౌన్ ప్లానింగ్ విభాగం డెరైక్టర్, ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని కార్పొరేషన్లు, 182 మున్సిపాల్టీల్లో ఆన్లైన్ సేవలు అందించాలని నిర్ణయించారని సమాచారం. దీనిపై సోమవారం విశాఖపట్నంలో జరిగిన ప్రత్యేక వర్క్‌షాపులో టౌన్ ప్లానింగ్ విభాగం డెరైక్టర్ తిమ్మారెడ్డి మున్సిపల్ కమిషనర్లకు పలు సూచనలు చేశారు. ఈ విధానం అమలైతే జిల్లాలోని శ్రీకాకుళం, పలాస, రాజాం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పాలకొండ మున్సిపాలిటీల ప్రజలకు మేలు చేకూరనుంది.
అవినీతికి చెక్!
ఈ విధానం అమలైతే మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది అవినీతికి చెక్ పడుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఎందుకంటే.. ప్రజలు లెసైన్స్డ్ ఇంజినీర్లు, సర్వేయర్ల ద్వారా ప్లాన్ నమూనాలు, తగిన ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే చెల్లించాల్సిన రుసుముకు సంబంధించిన డిమాండ్ నోట్‌ను వినియోగదారునికి పంపుతారు. నిర్ణీత సమయంలో రుసుము చెల్లిస్తే దానికి సంబంధించిన అనుమతి పత్రం ఆన్లైన్లో అందుతుంది. ఈ విధానం వల్ల అనుమతుల కోసం నెలల తరబడి వేచి ఉండనక్కరలేదు. మున్సిపల్ సిబ్బందికి చేతులు తడపాల్సిన పనిలేదు. అయితే, ఈ విధానం ఎంతవరకు అవినీతిని నిరోధిస్తుందో వేచిచూడాలి.