మిమిక్రీ శేషు..కామెడీ అదుర్స్
కడియం :పాత్ర ఏదైనా.. పంచ్ డైలాగులతో కితకితలు పెట్టించే కామెడీ అద్దంకి శేషుకుమార్ సొంతం... మిమిక్రీతో కళారంగం వైపు అడుగుపెట్టిన ఆయన ప్రస్తుతం బుల్లితెర కామెడీ షోలలో ‘బజర్దస్త్’గా సాగుతున్నారు. బుధవారం తన స్వగ్రామం కడియం మండలం దుళ్ల గ్రామంలోని ఆయన సోదరుడు అద్దంకి శ్రీనివాస్ ఇంటికి కుటుంబసమేతంగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కళారంగ అనుభూతులను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు...
‘‘మా నాన్నగారు అద్దంకి రామారావు (దుళ్ల కరణం) ప్రోత్సాహంతో మిమిక్రీలో పట్టుసాధించా. మూడు సార్లు మిమిక్రీలో గోల్డ్‌మెడల్స్ గెలిచా. దుళ్లలో ఏ పండుగొచ్చినా సెంటర్లో స్టేజీపై నా మిమిక్రీ ఉండేది. అలా గ్రామస్తుల చప్పట్లతో నా ప్రస్థానం మొదలైంది. ఓ సారి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును మక్కీకిమక్కీ అనుకరించడంతో ఆయన నన్ను అభినందించారు. కాకినాడలోని బాబ్జి, విశాఖలోని రోషన్‌లాల్ ఆర్కెస్ట్రాల్లో చాలాకాలం పనిచేశా.
అవకాశాల కోసం హైదరాబాద్ వెళ్లగా ఈటీవీలో ప్రసారమైన ష్.. కార్యక్రమంలో అవకాశం వచ్చింది. బాగా పేరు తెచ్చింది. తర్వాత భార్యామణి, కుంకుమరేకు, అభిషేకం వంటి సీరియళ్లతో పాటు, ‘మాయా బజార్’ అనే రాజకీయ వ్యంగ్య రూపకం కూడా నాకు గుర్తింపు తీసుకొచ్చింది. జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే ఫ్యామిలీ సర్కస్‌లో ‘పులిహోర’ టీమ్‌లో, ఈటీవీ జబర్దస్త్ చలాకీచంటి టీమ్‌లో చేశా. వాటిలో చాలా పాపులర్ అయ్యాను.
ఒక జంతువును అనుకరిస్తూ అభినయించడంలో అల్లు రామలింగయ్యతో సమానంగా, తాను చేశానని నాగబాబు చెప్పడం మరిచిపోలేని జ్ఞాపకం. ప్రస్తుత కాలంలో పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు చేస్తున్న పొరపాట్లను వివరిస్తూ కామెడీ స్క్రిప్ట్‌ను రూపొందిస్తున్నాం. టీవీ షోలతోపాటు పంచముఖి, ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్, లక్ష్మీరావే మాయింటికి రావే తదితర సినిమాల్లో నటించా. అవి త్వరలోనే విడుదల కానున్నాయి.’’