ఎర్రచందనం స్మగ్లర్కు ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలూకా, ఇరుంజీ గ్రామానికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ధనపాల్ రాజా కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.పది లక్షల జరిమానా విధిస్తూ రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ కోర్టు జడ్జి నాగరాజు సోమవారం తీర్పు చెప్పినట్లు ఆ కోర్టు ఏపీపీ కె.నగేష్ తెలిపారు. కోర్టు కానిస్టేబుళ్లు నందకుమార్, శివకుమార్ తెలిపిన కేసులోని వివరాల మేరకు.. శేషాచలం అటవీ ప్రాంతంలోని ఎర్రచందనం దుంగల రక్షణ కోసం ఎస్వీఎన్పీ శ్యామల రేంజ్ నాగపట్ల సెక్షన్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ హరిబాబు, సిబ్బంది 2016 ఆగస్టు 29వ తేదీ సాయంత్రం కూంబింగ్ నిర్వహించారు.
చెట్లు నరుకుతున్న శబ్దం విని పోలీసులు తోళ్లగుంట రిజర్వు ఫారెస్ట్ వద్దకు వెళ్లగా సుమారు 20 నుంచి 30 మంది స్మగ్లర్లు పోలీసులపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు తమ రక్షణ కోసం ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పరారయ్యారు.
2016 ఆగస్టు 30వ తేదీ రాత్రి పోలీసులు అదే ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి నిందితుడు ధనపాల్ రాజాని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి నిందితుడు ధనపాల్ రాజాకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా సొమ్ము చెల్లించని యెడల మరో రెండేళ్లు అధికంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు.