అవి తుగ్లక్ చేష్టలు
వైఎస్సార్ సీపీ నేత అంబటి ధ్వజం
దేవాలయాల్లో పెట్టాల్సిన హుండీలు సచివాలయంలోనా..?
హైదరాబాద్: విశేష పరిపాలనానుభవ ం ఉందని గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసమని హుండీలు ఏర్పాటు చేయడం పిచ్చి తుగ్లక్ చేష్టలను తలపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆలయాల్లో పెట్టాల్సిన హుండీలను సచివాలయంలో, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నించారు. భక్తులు సమర్పించే కానుకల కోసం దేవాలయాల్లో హుండీలు పెట్టే అధికారం, హక్కు ఒక్క దేవాదాయ, ధర్మాదాయ శాఖకు మాత్రమే ఉందని, ఎక్కడంటే అక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పారు. సామాన్య ప్రజలు సచివాలయానికి రావడంలేదని, మరి చంద్రబాబు ఎవరిని కానుకలడగడానికి సచివాలయంలో హుండీని ఏర్పాటు చేశారని ప్రశ్నించారు.
చంద్రబాబుకు ఓట్లేసిన ప్రజలు ఆయన మంచి పరిపాలన అందిస్తారని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని భావిస్తున్నారని, ఇలా హుండీలు పెట్టడానికి కాదని దుయ్యబట్టారు. టీడీపీ గెలిచిన తర్వాత ఈ రెండు నెలల్లో రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా? ప్రభుత్వం అనేది ఉందా? అనే అనుమానాలు సామాన్యులకు కూడా కలుగుతున్నాయని అంబటి విమర్శించారు. రుణ మాఫీ చేస్తారని రైతులు, డ్వాక్రా మహిళలు, ఉద్యోగాలొస్తాయని నిరుద్యోగులు, మినరల్ వాటర్ ఇస్తారని సామాన్య ప్రజలు ఓట్లేస్తే చంద్రబాబు వాటి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎర్రచందనం అమ్మి రుణ మాఫీ చేస్తా.. తెల్ల సిమెంటు అమ్ముతా అని కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని అన్నారు.