మనోజ్ కుమార్‌కు మరో ఏడు ప్రపంచ రికార్డులు
విజయనగరం కంటోన్మెంట్:కోరుకొండ సైనిక పాఠశాల పూర్వ విద్యార్థి మనోజ్‌కుమార్ గణితంలో తనకున్న అద్భుత మేధాశక్తితో ఏడు ప్రపంచ రికార్డులను సాధించి నెల గడవక ముందే మరో ఏడు రికార్డులను సాధించారని జేసీ-2 యూసీజీ నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన తన చాంబర్లో విద్యాశాఖ, ఇంటర్‌బోర్డు, డైట్, ఎస్ఎస్ఏ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా పౌరవేదిక, యూనిక్ వరల్డ్ రికార్డు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 24న ఆనందగజపతి కళాక్షేత్రంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో మనోజ్ కుమార్ తన మేధా శక్తిని, ప్రపంచ రికార్డులను ప్రదర్శించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రదర్శన ద్వారా గణితంలో మెలకువలు, సులభంగా సమస్య పరిష్కారం తదితర అంశాలపై సూచనలు, సలహాలు అందిస్తారన్నారు.
ఈ ప్రదర్శనకు గణిత మేధావులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులతో పాటు గణితంపై ఆసక్తి కలిగి ఉన్నవారంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమం నిర్వహణపై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. సమావేశంలో డీఈఓ జి కృష్ణారావు, ఎస్ఎస్ఏ పీఓ లింగేశ్వరరెడ్డి, జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, ఇంటర్మీడియట్ బోర్డు, డైట్ సంస్థల అధికారులు, కోరుకొండ సైనిక్ స్కూల్ అధికారులు పాల్గొన్నారు.