కిలాడి పెళ్లి కూతురు
కేకే.నగర్: పెళ్లి కూతురు కోసం వెతుకుతున్న ఏడుగురు యువకులను బ్రోకర్ల ద్వారా వివాహం చేసుకున్న కిలాడి యువతి నగలతో సహా పారిపోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఆమె మొదటి భర్తను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి పేరుతో ఎంతోమంది అమ్మాయిలను మోసం చేసి నగలతో ఉడాయించిన కిలాడి కృష్ణుల గురించి మనం చదువుతూ ఉంటాం. అయితే వారికే ఏ మాత్రం తీసిపోనంటూ నిరూపించింది పవిత్ర.
పేరు మార్చుకుని బ్రోకర్ల ద్వారా ఏడుగురు యువకులను పెళ్లిచేసుకుని వారితో కొన్ని రోజులు మాత్రమే గడిపి నగలు, నగదుతో ఉడాయించింది. 8వ సారి మరో యువకుడిని వివాహం చేసుకోవడానికి సిద్ధం కాగా మొదటి భర్తతో పట్టుబడిన సంఘటన తిరుపూర్ జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే...తిరుపూర్ జిల్లా తారాపురంకు సమీపంలోని కోణప్పన్ సాలై గ్రామానికి చెందిన నటరాజ్ పశువుల వ్యాపారి. ఇతని కుమారుడు సెల్వకుమార్‌కు పెళ్లి చేయాలని పెళ్లి కూతురును వెతికే పనిలో పడ్డారు.
చివరకు బ్రోకర్ ద్వారా దిండుకల్ జిల్లా పళని సమీపంలోని పొదుపట్టి గ్రామానికి చెందిన పవిత్ర (25)తో నిశ్చయం చేసి గత 2015 అక్టోబర్‌లో పెళ్లి చేశారు.ఈ క్రమంలో గత మే 27వ తేదీ తారాపురం పోలీసుస్టేషన్‌కు వచ్చిన సెల్వకుమార్ తన భార్య పవిత్ర 15 సవర్ల నగలతో కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు పవిత్రను వెతుకుతున్న సమయంలో ఆమె మొదటి భర్త కర్ణన్ (35)తో ఉడుమలై ప్రాంతంలో అజ్ఞాతంలో తల దాచుకున్నట్లు తెలిసింది.
ఆమె అసలు పేరు మారియమ్మాళ్ అని, మాలతి, పవిత్ర, ఏంజలిన్ అనే పలుపేర్లతో ఏడుగురిని మోసం చేసి వివాహం చేసుకున్నానని, మొదటి భర్త కర్ణన్, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ఖంగుతిన్నారు. కొన్ని సంవత్సరాలుగా పెళ్లి కూతురు దొరకని యువకులను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుని వారితో కొన్ని నెలలు కాపురం చేసి దొరికిన నగలు, డబ్బులతో ఉడాయించడం ఆమె వృత్తిగా పెట్టుకుందని విచారణలో తెలిపింది.
దీంతో ఉడుమలై బస్టాండులో నిలబడి ఉన్న పవిత్ర అలియాస్ మారియమ్మాళ్‌ను ఆమె మొదటి భర్త కర్ణన్‌ను తారాపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈమె తిరువూర్ జిల్లా పల్లడం అరిమాలినగర్‌కు చెందిన సెల్వరాజ్. పళని అమ్మాల్ దంపతులకు ఒకే కూతురు. మొదటి భర్త కర్ణన్‌తో తన పేరు మాలతి అని చెప్పి ఏడో భర్త సెల్వకుమార్‌తో పవిత్ర అని చెప్పి వివాహం చేసుకుంది. ఈమె పెళ్లి కొడుకుల వేటకు తారాపురం, ఉడుమలై, పళని, తిరుపూర్ ప్రాంతాలకు చెందిన పెళ్లి బ్రోకర్లు తొమ్మిదిమంది బ్రోకర్లు సహాయం చేశారు. వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.