అదునుదాటినా..
కడప అగ్రికల్చర్ :
తీవ్రవర్షాభావంతో జిల్లాలో కూరగాయల సాగు ప్రశ్నార్ధకంగా మారింది. భూగర్భజలాలు అడుగంటడంతో నర్సరీల యజమానులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో కురిసిన జల్లులు వారిలో ఆశలు రేపాయి. దీంతో రైతులు కూరగాయల సాగుకు సిద్ధపడినా ఆగస్టు నెల మొదటి నుంచి చినుకు జాడలేకపోవడంతో కూరగాయ పంటలు సాగయ్యే పరిస్ధితులు కనిపించలేదు. జిల్లాలో సంబేపల్లె, చిన్నమండెం, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు, వీరబల్లి, చక్రాయపేట, మైదుకూరు మండలాల్లో
అత్యధికంగా ఖాజీపేట, బి.మఠం, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, వేంపల్లె, వేముల, పులివెందుల, ముద్దనూరు, దువ్వూరు మండలాల్లో తక్కువగా కూరగాయలు సాగుచేస్తారు.
ఖరీఫ్ సీజన్లో జిల్లా ఉద్యానశాఖ–1,2 పరిధిలో టమాటా 16 వేల ఎకరాలు, మిరప 7వేలు, వంగ 6వేలు, ఉల్లి 12వేలు, కాకర400, బెండ 600, బీర 160, గోరుచిక్కుడు 90, అలపంద 80, బీన్స్ 70, అనప 45 ఎకరాల్లో సాగు చేస్తారు. బోరుబావుల కింద 22,445 ఎకరాలు, వర్షాధారంగా మరో 20వేల ఎకరాల్లో సాధారణ సాగు కావాల్సి ఉంది. అయితే జూన్ నెలల్లో కురిసిన అరకొర వర్షాలకు కేవలం అన్ని కూరగాయ పంటలు కలిపి జిల్లా వ్యాప్తంగా 2700 ఎకరాలకు మించి సాగు కాలేదు. జులైలో జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురవడంతో రైతులు అరకొరగా చేపట్టారు. జూన్లో 69.0 మిల్లీమీటర్లకుగాను 127 మి.మీ వర్షం పడింది. జులైలో 97 మి.మీటర్లు కురవాల్సి ఉండగా 120.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈ నెల మొదటి నుంచి చినుకు జాడేలేదు. సాధారణంగా టమాటా, బెండ, మిరప, వంగ, బీర, కాకర, సొర, మటిక తదితర పంటలు వేసేవారు 25 రోజుల వయస్సున్న నారు మొక్కలను నాటుకోవాలని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. అయితే నర్సరీల్లో రెండునెలల నుంచి పోసిన నార్లన్నీ ముదిరి పోవడంతో వాటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో చిన్నమండెం, సంబేపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు, సుండుపల్లె, చక్రాయపేట, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, వేంపల్లె, పులివెందుల, మైదుకూరు, దువ్వూరు, బద్వేలు, కలసపాడు, ఓబులవారిపల్లె, రాజంపేట తదితర మండలాల్లో మొత్తం 350కి పైగా నర్సరీలున్నాయి. వీటన్నింటిలోనూ నారు
ముదిరిపోతోందని నిర్వహకులు వాపోతున్నారు. రెండేండ్ల కిందట ఖరీఫ్ సీజన్లో ఒక్కొక్క నర్సరీలో లక్షలాది రూపాయల వ్యాపారం చేసి
లాభాలు ఆర్జించామని యజమానులు చెబుతున్నారు. అయితే గత,ఈ ఏడాది వర్షాభావంతో పోసిన నారును అడిగేనాధుడే లేడని అంటున్నారు.నర్సరీల్లో నారుపెంపకానికి విత్తనాలు, ఎరువులు, నారుపెంచే క్రేట్స్ కొనుగోలు చేశామని, తీరా నారు చేతికందుతున్న సమయంలో వానలు కురవకపోవడం, కొనుగోలు దారులు రాక పోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి
ప్రతి ఏటా నారు నర్సరీకి గిరాకీ ఉండేది. ఈ ఏడాది జూన్ నెలలో వర్షాలు కురవడంతో ఇక ఇబ్బంది లేదను కున్నాను. నారును పెంచాను. అయితే దాదాపు 25 రోజులుగా వానలు పడక నర్సరీలో నారు పెరిగిపోయింది. రైతులు పంటల సాగుకు పూనుకోకపోవడంతో నారు ముదురుతోంది. ఏం చేయాలో అర్ధం కావడంలేదు.
–వెంకటేశ్వర్లు, నర్సరీ నిర్వాహకుడు, చిన్నమండెం మండలం.
వర్షాభావంతో ఆదాయం కోల్పోయా...:
ఈ సీజన్లో నర్సరీ నుంచి నారు మొక్కలు బాగా అమ్ముడుపోతాయని ఆశించాను. రెండున్నర నెలలు అవుతున్నా ఇంతవరకు సరైన వర్షాలు పడలేదు. నర్సరీలో పూల మొక్కలు తప్ప ఇతర నారు ఎవరూ కొనుగోలు చేయడం లేదు. వర్షాభావంతో ఆదాయం కోల్పోయాను.
–వి రామచంద్రారెడ్డి, నర్సరీ నిర్వహకులు, పెండ్లిమర్రి మండలం.