అవసరమైతే సీఎం ఇంటి ముందు ధర్నా చేయండి !
► నీటి ఎద్దడి నివారణకు నిధుల కొరత లేకుండా చూడండి
► జిల్లా ఇన్చార్జ్ మంత్రికి స్పీకర్ సూచన
శివమొగ్గ : జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, అభివృద్ధి ఇన్చార్జ్ మంత్రి బాధ్యత అని, జిల్లాకు అభివృద్ధికి కరువు నివారణకు నిధులు విడుదల కాకపోతే సీఎం ఇంటిముందు ధర్నా చేయాలని శాసన సభస్పీకర్ కాగోడు తిమ్మప్ప జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కిమ్మనె రత్నాకర్‌కు సూచించారు. జిల్లాలో నెలకొన్న తాగు నీటి సమస్యపై చర్చించడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి ఉన్నతాధికారుల సమావేశంలో మంత్రి, స్పీకర్ పాల్గొన్నారు. స్పీకర్ కాగోడు తిమ్మప్ప మాట్లాడుతూ జిల్లాలో తాగు నీటి సమస్యను పరిష్కరించడానికి నిధుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా ఇన్చార్జ్ మంత్రిపై ఉందన్నారు. ఇంజనీర్ ఎస్,ఎం. హరిష్ మాట్లాడుతు గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు సుమారు రూ. 15 కోట్లతో చేపట్టిన పనులు ముగింపు దశలో ఉన్నాయని, అయితే ఇందుకు మరో రూ.31కోట్లు అవసరమని పేర్కొన్నారు.
స్పీకర్ కలుగజేసుకోని మాట్లాడుతూ ప్రభుత్వంతో మాట్లాడి నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత జిల్లా ఇన్చార్జ్పై ఉందని, నిధుల కోసం స్వయంగా సీఎంను కలవాలన్నారు. అప్పటికీ నిధులు కేటాయించకపోతే సీఎం ఇంటిముందు ధర్నాకు దిగండంటూ మంత్రి కిమ్మనె రత్నాకర్‌కు సూచించారు. కరువు సమస్యలపై అధికారులు అప్రమత్తంగా ఉంటూ కలెక్టర్‌కు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎమ్మెల్యే కె.బి.ప్రసన్న కుమార్, జెడ్పీ ఉపాధ్యక్షురాలు వేదా విజయ్‌కుమార్, జిల్లాకలెక్టర్ వి.పి.ఇక్కెరి, సీఈఓ రాకేష్‌కుమార్, జిల్లా ఎస్పీ రవి.డి.చెన్నణ్ణవర్ అదనపు కలెక్టర్ నాగరాజు పాల్గొన్నారు.