‘సెన్సీ’లో ఎయిర్‌టెల్‌కు వాటా
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ, భారతీ ఎయిర్టెల్, ఫైనాన్షియల్ టెక్నాలజీ స్టార్టప్ సెన్సీలో వ్యూహాత్మక ఈక్విటీ వాటాను కొనుగోలు చేసింది. తమ అనుబంధ కంపెనీ భారతీ ఎయిర్టెల్ సర్వీసెస్ ద్వారా ఈ డీల్ జరిగిందని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు. సెన్సీ సంస్థ, లోన్ సింగ్ పేరుతో డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫార్మ్ను ఏర్పాటు చేసింది. రుణం పొందగల వ్యక్తులకు సులభంగా రుణాలందేలా ఈ ప్లాట్ఫార్మ్ చూస్తుంది.
వినియోగదారులకు ఉత్తమమైన సేవలందించేందుకు గత కొన్నేళ్లుగా డేటా సైన్స్ సొల్యూషన్లను సొంతంగానే డెవలప్ చేశామని భారతీ ఎయిర్టెల్ గ్లోబల్ సీఐఓ, డైరెక్టర్ (ఇంజినీరింగ్) హర్మీన్ మెహత చెప్పారు. తమ వినియోగదారులు 27 కోట్లకు పైగా ఉన్నారని, సెన్సీతో కలసి వారికి అవసరమైన ఉత్పత్తులను, సేవలను అందిస్తామని వివరించారు. కాగా ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం తమకు మంచి అవకాశమని సెన్సీ డైరెక్టర్ గౌరవ్ జస్వాల్ చెప్పారు. ఎక్కువ మందికి వినూత్నమైన ఉత్పత్తులు, సేవలందించే అవకాశం లభించిందని పేర్కొన్నారు.