ఇక దేశానికి ఆ కోటి మందే దిక్కు!
కొత్త పన్ను విధానాన్ని షాదీ.కామ్ వ్యవస్థాపకుడు, షార్క్ ట్యాంక్ ఇండియా స్టార్ అనుపమ్ మిట్టల్ (Anupam Mittal) విమర్శించారు. దేశంలోని 140 కోట్ల జనాభాలో కోటి మంది మాత్రమే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పన్నులు చెల్లిస్తారని, తద్వారా భారత్ ఆదాయ పన్ను రహిత దేశంగా మారుతుందని ఎద్దేవా చేశారు.కేంద్ర బడ్జెట్లో (Union budget 2025-26) రూ.12 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపును ప్రకటించిన అనంతరం కొత్త పన్ను విధానాన్ని విమర్శిస్తూ అనుపమ్ మిట్టల్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ చేశారు. దేశంలో పన్ను దాఖలు చేసేవారిలో 90% మంది రూ. 13 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారేనని చెప్పుకొచ్చారు. అంటే ఆ మిగిలిన కొద్ది మంది మాత్రమే దేశానికి ట్యాక్స్ ఆదాయం అందిస్తారనేది ఆయన భావన.భారత్ "ఆదాయపు పన్ను రహిత దేశం" అవుతుందంటూ అనుపమ్ మిట్టల్ చేసిన వ్యాఖ్యలు కొత్త పన్ను విధానంలోని పన్నుల వ్యవస్థ హేతుబద్ధతపై చర్చను రేకిస్తున్నాయి. "భారతదేశంలో దాదాపు 90% ట్యాక్స్ ఫైలర్లు రూ.13 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారేనని తేలింది. అంటే 140 కోట్ల మందిలో కోటి మంది మాత్రమే ఈ సంవత్సరం ఆదాయపు పన్ను చెల్లిస్తారు. దేశాన్ని ఆదాయపు పన్ను రహితంగా మారుస్తారు" అని మిట్టల్ తన ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చారు.కొత్త పన్ను విధానం కేవలం పన్ను కోత కాదని, "వ్యవస్థాగత దిద్దుబాటు" అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రొఫెషనల్ సామాజిక వేదిక లింక్డ్ఇన్లో చర్చకు తెరతీశారు. బలమైన ఆర్థిక వ్యవస్థ సాధికారత కలిగిన మధ్యతరగతిపైనే ఆధారపడుతుందని, అధిక పన్నుల భారం మోపడం సరికాదని వాదించారు. ఈ సందర్భంగా అమెరికా, చైనాలతో దేశ పన్ను విధానాన్ని పోలుస్తూ భారత్‌లో గతంలో వేతనజీవులను అధిక పన్నులతో పిండేశారని ఆరోపించారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2025-26 కేంద్ర బడ్జెట్ దేశ పన్ను శ్లాబ్‌లలో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టింది. రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారు ఇక నుంచి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదని మంత్రి ప్రకటించారు.20 ఏళ్లకే కోటీశ్వరుడుజీవితం ఎప్పుడూ సాఫీగా సాగకపోవచ్చు. ఎన్నో బాధలు.. కష్టాలు.. అనుభవించాల్సి రావొచ్చు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కొన్నిసార్లు సంపాదించిన సొమ్మంతా కోల్పోవాల్సి రావొచ్చు. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనుపమ్ మిట్టల్. 20 ఏళ్లకే కోటీశ్వరుడైన ఆయన ఒడిదుడుకులను ఎదుర్కొని పడిలేచారు.'కొద్దికాలంలోనే గొప్ప విజయాలు సాధించా. 20 ఏళ్లకే కోటీశ్వరుడిని అయిపోయా. మైక్రోస్ట్రాటజీలో నేను ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉన్న సమయంలో కంపెనీ విలువ 40 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో బాగానే డబ్బులు సంపాదించా. తర్వాత పరిస్థితి మారిపోయింది. డాట్-కామ్ బబుల్ సమయంలో అంతా కోల్పోయా. అప్పుల్లో కూరుకుపోయా. తర్వాత ధైర్యం తెచ్చుకుని షాదీ.కామ్ స్టార్ట్ చేశా. మళ్లీ పూర్వవైభవం సాధించా' అంటూ అనుపమ్ గతంలో లింక్డ్ఇన్లో తన ప్రయాణాన్ని పంచుకున్నారు.