అప్రమత్తతే ప్రధానం.. విపత్తులపై కేంద్ర భౌగోళిక శాస్త్ర శాఖ
విపత్తులపై కేంద్ర భౌగోళిక శాస్త్ర శాఖ కార్యదర్శి శైలేష్ నాయక్
సాక్షి, హైదరాబాద్: మహాసముద్రాల్లో రగిలే ఉప్పెనలు, ఉపద్రవాలపై ప్రజల్లో పూర్తి స్థాయి అప్రమత్తత కల్పించడం ద్వారానే నష్టాన్ని వీలైనంత తగ్గించగలమని, ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర వాతావరణ శాఖలను ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంచుతున్నామని కేంద్ర భౌగోళిక శాస్త్ర శాఖ కార్యదర్శి శైలేష్ నాయక్ చెప్పారు. సునామీలు, తుపానుల కదలికలు, తీవ్రతను కచ్చితంగా అంచనా వేసేం దుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నామని; ఆసియా, ఐరోపా దేశాలతో కలిసి అధ్యయనాలు చేస్తున్నట్టు తెలిపారు.
హిందూ మహాసముద్రంలో ఉద్భవించిన హెలెన్ తుపానును ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సముద్ర ఉత్పాతాలు, నష్ట నివారణ అంశాలపై హైదరాబాద్లోని ‘ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్కాయిస్)’లో అంతర్జాతీయ సెమినార్ గురువారం ప్రారంభమైంది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన శైలేష్నాయక్ మీడియాతో ముచ్చటిస్తూ అప్రమత్తత, సత్వర నియంత్రణ చర్యల ద్వారానే పైలీన్ తుపానులో ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని, అంతే తీవ్రతలో ఫిలిప్పీన్స్లో సంభవించిన తుపాను వల్ల 1,200 మంది చనిపోయారని గుర్తుచేశారు. భూ, సముద్ర గర్భాల్లో ప్రకంపనలను వెంటనే పసిగట్టి, ప్రతి క్షణం వాటి కదలికలపై సత్వర సమాచారాన్ని పొందేందుకు దేశంలోని జీపీఎస్ స్టేషన్లన్నింటినీ అనుసంధానిస్తున్నట్టు వెల్లడిం చారు. సదస్సులో ఇన్కాయిస్ డెరైక్టర్ డాక్టర్ ఎస్ఎస్సీ షినోయ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డెరైక్టర్ డాక్టర్ ధరియావాల్ పాల్గొన్నారు.