చంపాలని చూస్తాండు..
గూడూరు : కట్టుకున్నోడే తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడని, ఇంట్లో బంధించి తనను, తన ముగ్గురు పిల్లలను చంపాలని చూస్తున్నాడని ఓ మహిళ గూడూరు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత విలేకరుల ఎదుట తన గోడును వెల్లబోసుకుంది. బాధితురాలు షేక్ సమీనాబేగం తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు మండలంలోని బొద్దుగొండకు చెందిన తనకు 2009లో రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన షేక్ ఖాజాపాషాతో వివాహమైందని, పెళ్లి సమయంలో కట్నకానుకలుగా తన తల్లిదండ్రులు రూ.2లక్షలతోపాటు 6 తులాల బంగారం ఇచ్చారని చెప్పింది. అరుుతే, ఖాజాపాషా వికారాబాద్‌లో రౌడీషీటర్‌గా గుర్తింపు పొందాడని, ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలియక పెళ్లి చేశారని సమీనాబేగం చెప్పింది.
క్రూరుడైన ఖాజాపాషా నిత్యం వేధించేవాడని, అతడు పెట్టే ఇబ్బందులు ఎవరికైనా చె బితే తన తల్లిదండ్రులను చంపుతానని బెదిరించేవాడని, తమకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని, తల్లిదండ్రుల పేదరికాన్ని తెలిసి.. భర్త పెట్టే బాధలను భరిస్తూ కాపురం చేశానని ఆమె రోదిస్తూ చెప్పుకుంది. నాలుగేళ్లుగా తనను ఇంట్లో బంధించాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతడిపై 25 కేసులున్నాయని, ఓ కేసులో యావజ్జీవ శిక్ష పడే అవకాశాలు ఉన్నందున, తన పుట్టింటి నుంచి రూ.5ల క్షలు అడిగి తేవాలని, లేకుంటే తనను, తన పిల్లలను చంపుతానని వేధిస్తున్నాడని వివరించింది. చివరకు మూడు రోజుల క్రితం.. ఖాజాపాషా ఇంట్లో లేని సమయంలో పిల్లలతో కలిసి ఇరుగుపొరుగు వారిని బస్‌చార్జీలను అడుక్కుని పుట్టింటికి చేరుకున్నానని సమీనాబేగం తెలిపింది.
ఇంత కాలం తనకు బయటి ప్రపంచం అంటే ఏమిటో తెలియదని విలపించింది. చివరకు ఓ పెద్దమనిషి ద్వారా తల్లిదండ్రులకు తన బాధనంతా చెప్పుకుని పోలీసులకు ఫిర్యాదు చేశానని, తన రోదన విన్న సీఐ వెంకటేశ్వర్రావు వెంటనే స్పందించి తన భర్త ఖాజాపాషాను పట్టుకొచ్చారని, అయినా తనను, తన పిల్లలను పోలీసుల ఎదుటనే చంపుతానంటున్నాడని, ఆ క్రూరమృగం నుంచి కాపాడాలని, తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంది. సమీనాబేగం, ఆమె తల్లిదండ్రులు మహ్మద్ జిలాని, ఖాజాబేగం ఫిర్యాదు మేరకు ఖాజాపాషాపై కేసు నమోదు చేసి డీఎస్పీకి బదిలీ చేస్తున్నట్లు గూడూరు పోలీసులు తెలిపారు.