అలాంటి ప్రశ్న ఎలా అడుగుతారు...? జర్నలిస్ట్‌పై రెజీనా ఫైర్
జర్నలిస్ట్‌పై హీరోయిన్ రెజీనా ఫైర్ అయింది. అందర్ని ఇలాంటి ప్రశ్నలే అడుగుతారా? అమ్మాయిల్ని గొప్పగా చూపిస్తూ సినిమా తీస్తే మీరు ఏంటి అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని సీరియస్ అయింది. వివరాల్లోకి వెళితే.. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని డాకిని’. సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. డి. సురేష్‌బాబు, సునీత తాటి, హ్యూన్యు థామస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది.
(చదవండి: ప్రతి వారం ఓ బాహుబలి రాదు)
ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఓ విలేకరి.. ‘మేడమ్ మీరు ఈ చిత్రంలో ఓసీడీ ఉన్నట్లు నటించారు కదా? నిజ జీవితంలో కూడా మీకు ఓసీడీ ఉందా? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న రెజీనాను ఇబ్బందికి గురిచేసింది. ‘మీరు అందర్ని ఇలాంటి ప్రశ్నలే అడుగుతారా? సినిమాలో మేము కేవలం నటిస్తామంతే. పాత్ర డిమాండ్ మేరకు మేము అలా చేస్తాం. అంత మాత్రాన నాకు ఓసీడీ ఉంటుందా? అమ్మాయిల్ని గొప్పగా చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాంటిది మీరు నా పాత్ర, ఓడీసీ గురించి అడుగుతారేంటి? అసలు ఓసీడీ అంటే ఏంటో మీకు తెలుసా? వ్యక్తిగతంగా నేను శుభ్రతను ఇష్టపడతాను . ఓసీడీ లాంటి సైకలాజికల్ డిజార్డర్స్ నాకు లేవు. ఓడీసీ ఉన్న అమ్మాయి పాత్రలో నటించానంతే’ అని రెజీనా బదులిచ్చింది.
అయితే సదరు విలేకరు మాత్రం తాను అడిగిన ఉద్దేశం వేరని వివరణ ఇచ్చాడు. ‘కరోనా తర్వాత అందరూ పరిశుభ్రత ఎక్కువగా పాటిస్తున్నారు కదా..మీరు కూడా అలానే ఉండడానికి ఇష్టపడతారా? అనేది నా ప్రశ్న ఉద్దేశం’అని చెప్పడంతో రెజీనా నవ్వుతూ.. ‘నేను పరిశుభ్రంగానే ఉంటాను..అందరూ అలానే ఉండాలి’అని బదులిచ్చారు.