అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి పాల్పడిన ముగ్గురికి రిమాండ్
నారాయణఖేడ్: అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు ఖేడ్ సీఐ ముని తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మండలంలోని అబ్బెందలో ఉన్న అంబేద్కర్ విగ్రహం కుడి చేతి భాగాన్ని ఈ నెల 22న రాత్రి 2గంటలకు ధ్వంసం చేశారు. దీనిపై వీఆర్వో శ్యామ్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సర్పంచ్ భర్త అయిన గ్రామ మచ్కూరీ అనంత్ మరో ఇద్దరితో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలిపారు. పంచాయతీకి సంబంధించిన నిధుల దుర్వినియోగం, రికార్డులు అప్పగించని కారణంగా సర్పంచ్ పార్వతి చెక్ పవర్‌ను రద్దు చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని అనంత్ గ్రామంలో గొడవలు సృష్టించేందుకు నాందేవ్, పండరితో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
ఈ నెపాన్ని ఇతరుల పైకి నెట్టేందుకు కుట్ర పన్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారు ముగ్గురూ దళితులేనని తెలిపారు. సంఘటనపై న్యాయ సలహా తీసుకొని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని సీఐ చెప్పారు. ఆయనతో పాటు ఎస్ఐ సునీల్, సిబ్బంది ఉన్నారు.