బట్టలూడదీసి కొడతా! : ఎమ్మెల్యే రత్నం
తెలంగాణ కోసం నేనూ ఆమరణ దీక్ష చేశా
నేను తల్చుకుంటే మీ సంగతి తేలుస్తా
రచ్చబండలో కాంగ్రెస్ నాయకులపై
టీడీపీ ఎమ్మెల్యే రత్నం ఆగ్రహావేశాలు
ఎమ్మెల్యే పరుషపదజాలంపై
కాంగ్రెస్ నాయకుల నిరసన
క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
కిరణ్, చంద్రబాబుల ఫొటోల విషయమై ఇరువర్గాల వాగ్వాదం
సహనం కోల్పోయిన చేవెళ్ల ఎమ్మెల్యే రత్నం
శంకర్పల్లి, న్యూస్‌లైన్: శంకర్‌పల్లిలో గురువారం జరిగిన రచ్చబండ కార్యక్రమం కాంగ్రెస్, టీడీపీ నాయకుల వాక్బాణాలతో చినికి చినికి గాలివానలా మారింది. తెలంగాణ వ్యతిరేకి సీఎం ఫొటోను రచ్చబండలో ఎలా పెడతారని టీడీపీ నాయకులు ప్రశ్నించగా.. తెలంగాణ విషయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలుచేస్తున్న చంద్రబాబు ఫొటోను శంకర్పల్లి గ్రామపంచాయతీ భవనంలో ఎలా ఉంచుతున్నారని.. స్థానిక ఎమ్మెల్యే రత్నం తెలంగాణ ద్రోహి అని.. చంద్రబాబు తొత్తుగా మారారని కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగడంతో రచ్చబండ సభలో రగడ మొదలైంది. ఈ నేపథ్యంలో సభలోనే ఉన్న ఎమ్మెల్యే రత్నం కాంగ్రెస్ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకదశలో సహనం కోల్పోయి పరుష పదజాలంతో దూషణల పర్వానికి దిగారు. కాంగ్రెస్ నాయకులారా ఖబడ్డార్.. బట్టలూడదీసి కొడతా నా కొడకల్లారా.. అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు..
గురువారం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన రచ్చబండ ప్రారంభంలోనే టీడీపీ నాయకులు జై తెలంగాణ, జైజై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ సభా వేదికపైకి దూసుకెళ్లారు. తెలంగాణ వ్యతిరేకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ డౌన్‌డౌన్ అంటూ ఆయన ఫొటోతో ఉన్న బ్యానర్‌ను లాగేశారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు వెంటనే కాంగ్రెస్ జిందాబాద్.. రెండుకళ్ల చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో మార్కెట్ కమిటీ చైర్మన్ మాణిక్‌రెడ్డి లేచి మేం కూడా తెలంగాణవాదులమే.. ముఖ్యమంత్రి బొమ్మ పెట్టొద్దంటున్నారు సరే... తెలంగాణ విషయంలో రెండుకళ్ల సిద్ధాంతం అవలంబిస్తున్న చంద్రబాబును శంకర్పల్లి గ్రామపంచాయతీలో ఎలా పెడతారని.. వెంటనే ఆ ఫొటోను తొలగించాలని డిమాండ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
టీడీపీ, కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తూ సభకు ఆటంకం కలిగించారు. సమైక్యవాది చంద్రబాబు తొత్తు ఎమ్మెల్యే రత్నం తెలంగాణ ద్రోహి.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన రత్నం.. కాంగ్రెస్ నాయకుల్లారా ఖబడ్డార్.. బట్టలూడదీసి కొడతా నా కొడకల్లారా.. తోలుతీస్తా నేనెందుకైతరా తెలంగాణ ద్రోహిని నా కొడకల్లారా.. తెలంగాణ కోసం చేవెళ్ల గడ్డమీద ఆమరణదీక్ష చేసిన.. మీకు బుద్ధి ఉందా.. సిగ్గూశరం లేదా.. నేను దళిత ఎమ్మెల్యేను.. నేను తలుచుకుంటే మీ సంగతి తేలుస్తా.. అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు అదే తీరున ఆగ్రహం వ్యక్తచేస్తూ ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకొని నిరసనకు దిగారు. ఎమ్మెల్యేగా ఉండి ప్రజాప్రతినిధులు వాడరాని భాష వాడుతున్న రత్నం ఒక ఎమ్మెల్యేనా సిగ్గు సిగ్గు అంటు నినాదాలు చేశారు. వాడుక భాష బాగాలేని ఎమ్యెల్యే శాసనసభలో ఉండటానికి అర్హత లేదంటూ ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరుష పదజాలంతో దూషించిన ఎమ్యెల్యే రత్నం క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాణిక్‌రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అనంతరం పోలీసులు ఇరువర్గాలను సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగించింది. కార్యక్రమం కొనసాగింది.