భారతీయుడి హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష
సింగపూర్: భారతీయుడి హత్య కేసులో మలేసియాకు చెందిన గారింగ్కి సింగపూర్ కోర్టు ఉరిశిక్ష విధించింది. అలాగే నిందితుడికి సహకరించిన టోని లంబాకు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు సింగపూర్ హైకోర్టు జడ్జి సోమవారం తీర్పు వెలువరించారు. భారత్‌కు చెందిన షణ్ముఖనాథన్ (41) సింగపూర్‌లో నిర్మాణ రంగంలో పని చేస్తున్నాడు. అయితే 2010లో మే 29 అర్థరాత్రి షణ్ముఖ్ నివాసంలో చోరీకి యత్నించారు. ఆ సమయంలో షణ్ముఖ్తోపాటు అతని రూమ్‌లోని ముగ్గురు ప్రతిఘటించారు.
దీంతో ఆగ్రహించిన గారింగ్... షణ్ముఖ్‌ను హత్య చేసి...మిగతా వారిపై దాడి చేసి... తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం గారింగ్తోపాటు లంబా చోరీ చేసి పరారైయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అరెస్ట్ చేసి...కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుపై కోర్టులో వాదోపవాదాలు ఇటీవలే పూర్తయ్యాయి. గారింగ్, లంబాలను నేరస్తులుగా భావించిన హైకోర్టు న్యాయమూర్తి శిక్షను ఖరారు చేశారు.