ఫొటో సాక్షిగా కేంద్రమంత్రి దొరికేశారు
న్యూఢిల్లీ: ప్రముఖ గాయకుడు, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సోషల్ మీడియా సాక్షిగా పొరపాటు చేసి నెటిజెన్లకు అడ్డంగా దొరికిపోయారు. చివరకు పొరపాటు తెలుసుకున్న మంత్రి.. తన స్నేహితుడిపై నెపం వేసి తప్పించుకున్నారు.
రాజ్‌కోట్‌లో కొత్తగా నిర్మించిన బస్టాండ్ ఇదేనంటూ సుప్రియో వేరే ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది లండన్లోనో లేదా న్యూయార్క్‌లోనో ఉన్న ఎయిర్పోర్ట్ కాదు.. గుజరాత్‌లోని రాజకోట్‌లో ప్రారంభించిన కొత్త బస్టాండు అంటూ మంత్రి ట్వీట్ చేస్తూ మూడు ఫొటోలను పోస్ట్ చేశారు. నిజమేనని భావించి కొందరు ప్రముఖులు కూడా వీటిని షేర్ చేశారు. అయితే మంత్రి నిర్వాకంపై నెటిజెన్లు సెటైర్లు వేస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. రాజ్‌కోట్‌లోని అసలైన బస్టాండ్ ఇదేనని, రాజ్‌కోట్ ఇప్పటిలాగే ఉంటుందని కామెంట్ చేస్తూ ఓ నెటిజెన్ అసలైన ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో పొరపాటు తెలుసుకున్న మంత్రి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. చిన్ననాటి క్లాస్మేట్ ఈ ఫొటోలను పంపాడని, తొందరపాటులో తాను వీటిని పోస్ట్ చేశానని వివరణ ఇచ్చారు. అయితే బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి నిజాన్ని నిర్ధారించుకోకుండా ఎలా పోస్ట్ చేస్తారంటూ నెటిజెన్లు విమర్శించారు.