మార్కెట్లో మళ్లీ మొదలైన దౌర్జన్యం
కేసముద్రం, న్యూస్‌లైన్ : కేసముద్రం మార్కెట్లో సమసిపోరుునట్లేనని భావించిన కూలీల దాన,ధర్మాల వివాదం మళ్లీ మొదటికొచ్చింది. మార్కెట్లో దానధర్మాల పేరిట కూలీలు ధాన్యం తీసుకోవడం ఇకమీదట జరగదంటూ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇటీవల ఇదే విషయమై కూలీలు రైతులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మార్కెటింగ్ శాఖ అధికారులు, ఇటు రూరల్ ఎస్పీ పాలరాజు సీరియస్‌గా తీసుకున్నారు.
మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యాపార, రైతు, కూలీ సంఘాల నాయకులతో రెండు రోజుల క్రితం డీడీఎం, ఏడీఎం, పాలకవర్గం సమక్షంలో చర్చలు జరిపారు. అనంతరం ఇక నుంచి దానధర్మాలు ఉండవని తెలిపారు. దీంతో చర్చల అనంతరం ఎట్టకేలకు గురువారం మార్కెట్ పునఃప్రారంభం కాగా మార్కెట్లో మళ్లీ కూలీలు దానధర్మాల పేరిట రైతులపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఆగ్రహించిన రైతులు తాము ఎందుకు ధాన్యం ఇవ్వాలంటూ నిలదీయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫలితంగా సాయంత్రం వరకు మక్కలకు వేలం పాటలు నిలిచిపోయాయి.
చివరికి మార్కెట్ కమిటీ చైర్మన్ మాదవపెద్ది శశివర్దన్‌రెడ్డి వ్యాపారులతో, కార్మిక నాయకులతో చర్చలు జరిపారు. అయినా సమస్య కొలిక్కి రాకపోవడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు మక్కలకు వేలంపాటలు నిలిచిపోయాయి. అప్పటికే అక్కడికి చేరుకున్న రైతు సంఘం నాయకులు రైతుల పక్షాన నిలవగా, కూలీల తరఫున కార్మిక సంఘాల నాయకులు నిలిచారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సరుకులకు ఎందుకు వేలం పాటలు పెట్టరంటూ రైతులు మార్కెట్ కార్యాలయానికి దూసుకొచ్చి దిగ్బంధించారు.
విషయం తెలుసుకున్న ఎస్సై అబ్దుల్ రహమాన్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆగ్రహించిన రైతులను శాంతింపజేశారు. అనంతరం కార్మిక సంఘం నాయకులతో, రైతు సంఘం నాయకులతో ఎస్సై, మార్కెట్ చైర్మన్ చర్చలు జరిపారు. చివరకు పడిగాపులు పడుతున్న రైతులను దృష్టిలో పెట్టుకోనైనా దానధర్మాలు లేకుండా కాంటాలు పెట్టాలని, కూలీల సమస్యలను తర్వాత పరిష్కరించుకోవాలే తప్ప రైతులపై ఇలా దౌర్జన్యాలకు దిగడం సరికాదని ఎస్సై కూలీలను, ఆ సంఘాల నాయకులను హెచ్చరించారు.
ఎస్సై ప్రతి యార్డు తిరుగుతూ పోలీస్ బందోబస్తు మధ్య కూలీలతో ధాన్యాన్ని, మక్కలను, పెసర్లను, పసుపును ఎత్తించారు. కూలీల ప్రవర్తనతో రైతులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. మార్కెట్లో కూలీలు చేస్తున్న దౌర్జన్యాన్ని అరిక ట్టాలని రైతులు, రైతుసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
మళ్లీ మార్కెట్‌కు సెలవులు
కొలిక్కి వచ్చిందనుకున్న సమస్య మళ్లీ మొదటికి రావడంతో కూలీలతో పూర్తిస్థాయి చర్చలు జరిపేందుకుగాను మార్కెట్‌కు ఈనెల 20, 21 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్మన్ మాదవపెద్ది శశివర్దన్‌రెడ్డి తెలిపారు.