స్పాట్ ఎక్స్ఛేంజ్ యాజమాన్యంపై వేటు
ముంబై: సీఈవో అంజనీ సిన్హాసహా మొత్తం యాజమాన్యాన్ని(టాప్ మేనేజ్మెంట్) తొలగిస్తున్నట్లు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) మంగళవారం తెలిపింది. తొలి దశ చెల్లింపులలో విఫలంకావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కమోడిటీ కాంట్రాక్ట్‌ల సెటిల్మెంట్లకు సంబంధించి తొలి దశలో భాగంగా చెల్లించాల్సిన రూ. 175 కోట్లలో రూ. 92 కోట్లను మాత్రమే సమకూర్చినందున యాజమాన్యంపైవేటు వేసినట్లు ఎన్ఎస్ఈఎల్ బోర్డు వివరించింది. వెంటనే అమల్లోకివచ్చే విధంగా సీఎఫ్‌వో శశిధర్ కోటియాన్తోపాటు మరో ఐదుగురిని తొలగించినట్లు తెలిపింది.
అంతేకాకుండా ఎక్స్ఛేంజీ విధులను నిర్వర్తించేందుకు ప్రత్యేక అధికారి(ఓఎస్ఈడీ)గా పీఆర్ రమేష్‌కు ఎంపిక చేసినట్లు వెల్లడించింది. సీఈవో అధికారాలను రమేష్ కలిగి ఉంటారని, బోర్డుకు ప్రత్యక్ష జవాబుదారీగా వ్యవహరిస్తారని తెలిపింది. కాగా, తొలి దశ చెల్లింపుల్లోనే విఫలంకావడంతో ఎక్స్ఛేంజీ విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తుతాయని ఎన్ఎస్ఈఎల్ బోర్డుకి ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్ఎంసీ) తెలియజేసింది.
తొలి దశ చెల్లింపులకు సంబంధించిన 15 మంది సభ్యులలో 9మంది విఫలమైనట్లు(డిఫాల్టర్స్) ఎన్ఎస్ఈఎల్ తెలిపింది. డిఫాల్టర్లలో ఆర్క్ ఇంపోర్ట్స్, లోయిల్ ఓవర్సీస్ ఫుడ్స్, లోటస్ రిఫైనరీస్, ఎన్కే ప్రొటీన్స్, ఎన్సీసీ షుగర్స్, స్పిన్ కాట్ టెక్స్టైల్స్, తవిషీ ఎంటర్ప్రైజెస్, విమలాదేవీ ఆగ్రోటెక్, యథురీ అసోసియేట్స్ ఉన్నాయి. కాగా, కమోడిటీ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎఫ్ఎంసీను ఆర్థిక శాఖ పర్యవేక్షణలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ఎంసీ ప్రస్తుతం వినియోగ వ్యవహారాల శాఖ కింద పనిచేస్తోంది.