నా బయోపిక్‌లో అతను నటిస్తే బాగుంటుంది!
ముంబై: షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా ఇటీవల తన జీవితకథను ప్రచురించారు. తన మ్యానరిజం డైలాగ్ అయిన 'ఖామోష్' అనే పదాన్ని తన జీవితకథకు టైటిల్‌గా పెట్టారు. ఇక తన జీవితకథ ఆధారంగా సినిమా వస్తే అందులో 'బాజీరావు మస్తానీ' స్టార్ రణ్‌వీర్‌సింగ్ తనలాగా నటిస్తే బాగుంటుందని ఆయన మనస్సులోని మాట వెల్లడించారు.
'నిజంగా నా జీవితం ఆధారంగా తీసే సినిమా మంచి కథ అవుతుంది. స్ఫూర్తినిచ్చే గొప్ప సినిమాగా నిలిచే అవకాశముంది. ఈ కథలో రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్నీ ఉంటాయి. హీందీలో నా జీవితకథను సినిమాగా తీస్తే అందులో రణ్‌వీర్‌సింగ్ నటిస్తే బాగుంటుంది. లేకపోతే అచ్చు నాలాగే ఉండే నా కొడుకులు లవ్, కుష్ ఈ పాత్ర వేసినా బాగుంటుంది. నేను కూడా ఈ సినిమాలో ఏదో ఒక పాత్ర వేస్తాను' అని ఆయన విలేకరులతో అన్నారు. బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ అయిన శత్రుఘ్న జీవితకథను 'ఎనిథింగ్ బట్ ఖామోష్: ద శత్రుఘ్నసిన్హా బయోగ్రఫీ' పేరిట రచయిత భారతి ఎస్ ప్రధాన్ రచించారు. ఈ పుస్తకాన్ని ఈ నెల 19న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆవిష్కరించారు.