Shazia
-
బూట్లు ఉతికే లాండ్రి.. కొత్త తరహా ఉపాధి
జీవితంలో ఎన్నో అనుకుంటాం. కానీ అనుకున్నవన్నీ జరగవు. కొంతమంది అనుకున్నవి జరగకపోయినా... ఇప్పటికి ఇదే ప్రాప్తం అనుకుని ఉన్నదానితో సంతృప్తి చెందుతుంటారు. మరికొందరు మాత్రం తాము చేసే పనిలో సంతృప్తి దొరకక నిత్యం మధనపడుతుంటారు. ఇలా మధనపడుతూనే తనకు నచ్చిన పనిని ఎంచుకుని షూ లాండ్రీ యజమానిగా మారి ఎంతో సంతృప్తిగా జీవిస్తోంది షాజియా కైజర్. బీహార్‌లోని భాగల్పూర్కు చెందిన షాజియా ఓ ప్రభుత్వ ఉద్యోగి కూతురు. ఇంటర్మీడియట్ అయిన వెంటనే పెళ్లి చేశారు. షాజియాకేమో పై చదువులు చదవాలని ఆశ. తన కెరీర్‌ను ఉన్నతంగా మలుచుకోవాలన్న కోరిక. ఈ క్రమంలోనే భర్త అనుమతితో ఫిజియో థెరపీలో డిగ్రీ పూర్తి చేసింది. అయితే ఫిజియోథెరపిస్టుగా పనిచేయకుండా రెండేళ్లపాటు టీచర్ ఉద్యోగం చేసింది. తనకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ మనసులో ఇంకా ఏదో చేయాలన్న తపన. అదికూడా పెద్దగా చేయాలి. దీంతో టీచర్ ఉద్యోగం మానేసే యూనిసెఫ్‌లో చేరింది. ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ స్వేచ్ఛగా పనిచేసే వెసులుబాటు కనిపించకపోవడంతో ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంది. బూట్లు ఉతికే లాండ్రి ఓ రోజు మ్యాగజీన్ చదువుతోన్న షాజియాకు బూట్లు శుభ్రం చేసే లాండ్రి సర్వీస్ గురించి తెలిసింది. బూట్ల లాండ్రీ పెడితే బావుంటుందన్న ఆలోచనతో షూస్‌ని ఎలా శుభ్రం చేస్తారో తెలుసుకోవడం ప్రారంభించింది. లెదర్‌తో తయారు చేసే షూలను వివిధ రకాల రసాయనాలు ఉపయోగించి క్లీన్ చేస్తారని తెలిసింది. షూ క్లీనింగ్ గురించి మరింతగా తెలుసుకునేందుకు చెన్నైలోని ‘సెంట్రల్ ఫుట్‌వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’లో చేరి పాదరక్షలను తయారు చేసే టెక్నాలజీ, డిజైనింగ్ గురించి పూర్తిగా స్టడీ చేసింది. ఆ తరువాత నోయిడాలోని ‘ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో చేరి లెదర్‌తో తయారు చేసే చెప్పులు, బూట్లు, వివిధ రకాల బ్యాగ్‌ల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. పట్నాలో 2014లో బూట్లు శుభ్రం చేసే ‘రివైవల్ షూ లాండ్రి’ పేరుతో ఇద్దరు పనివాళ్లతో కలిసి ఒక చిన్నపాటి షాపును ప్రారంభించింది. అయితే షూ లాండ్రీ అంటే ఏమిటో తెలియక వీరి షాపుకు చాలామంది చినిగిపోయిన బూట్లు తెచ్చి ఇచ్చేవారు. వారిని ఏమాత్రం విసుక్కోకుండా వాటిని చక్కగా కుట్టి శుభ్రంగా కడిగి కొత్తవాటిలా మార్చి తిరిగి ఇవ్వడంతో లాండ్రీకి వచ్చే కస్టమర్ల సంఖ్య పెరిగింది. దాంతో చూస్తుండగానే ఈ బిజినెస్ పెరిగిపోయింది. వీరి లాండ్రీకి కస్టమర్ల నుంచి ఆదరణ లభించడంతో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ 2016లో షాజియా షూ లాండ్రిని ‘బెస్ట్స్టార్టప్’ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు లక్షల టర్నోవర్‌తో లాండ్రీ నడుస్తోంది. సీఎం నితీష్‌కుమార్, ఇంకా సీనియర్ ఉన్నతాధికారులు సైతం షాజియా లాండ్రిలో బూట్లు సర్వీసింగ్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం పాట్న వ్యాప్తంగా ఐదు అవుట్లెట్లతో ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తోంది షాజియా లాండ్రీ. అంతేగాక షాజియా దగ్గర షూ క్లీనింగ్‌లో శిక్షణ తీసుకున్న కొంతమంది ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఢిల్లీ, ఒడిషాలలో షూ లాండ్రీలను నడుపుతున్నారు. రంగు వెలిసినా... షాజియా లాండ్రీలో రంగువెలిసిన బూట్లకు కొత్త రంగు వేయడం, ట్రాలీబ్యాగ్స్, బ్యాక్‌ప్యాక్స్, లెదర్, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లను రిపేర్ చేయడంతోపాటు షూస్‌ను ఆవిరి మెషిన్ మీద శుభ్రం చేసి ఇస్తుంది. -
స్ఫూర్తి: తలవంచని పాట
పాడటం తప్పు కాదు... అదొక అద్భుతమైన కళ అయితే ఆ కళ కొందరికి కంటగింపుగా మారింది కశ్మీర్లో బహిరంగ వేదిక ఎక్కి ఒక అమ్మాయి పాట పాడటం అనేది అంత తేలికైన విషయం కాదు! వెర్రితలలు వేసే వెక్కిరింపులతో పాటు, ‘ప్రాణాలు తీస్తాం’ అని బెదిరింపులు కూడా ఎదురవుతుంటాయి. ఆ బెదిరింపులకు భయపడి ఉంటే కశ్మీర్‌లోని మారుమూల పల్లెలో పుట్టిన షాజియా బషీర్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో రాణించేది కాదు. ఎంతోమంది యువకళాకారులకు స్ఫూర్తిని ఇచ్చి ఉండేది కాదు... దక్షిణ కశ్మీర్‌లోని తాజివర అనే ఊళ్లో పుట్టింది షాజియ. చిన్నప్పటి నుంచి పాటలు అద్భుతంగా పాడేది. సంగీతంలో ఎక్కడా శిక్షణ తీసుకోకపోయినా, ఆ అందమైన ప్రకృతే ఆమెకు రాగాలు నేర్పిందేమో అన్నట్లుగా ఉండేది. పెరిగి పెద్దయ్యాక కూడా ఆమె పాట బాటను వీడలేదు. మిలే సుర్ (డిడి కశ్మీర్) అనే టీవీ కార్యక్రమానికి ఎంపిక కావడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. రకరకాల వడపోతల తరువాత ఎంపికైన నలుగురిలో తానొక్కతే అమ్మాయి. ఈ కార్యక్రమంతో షాజియాకు గాయనిగా ఎంతో పేరు వచ్చింది. మరోవైపు ‘రేడియో కశ్మీర్’ కోసం తాను పాడిన పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఏ ఊళ్లో సంగీత కార్యక్రమం జరిగినా తనను పిలిపించి పాడించేవారు. బాలీవుడ్ మసాలా పాటలు కాకుండా కశ్మీరి సంప్రదాయ జానపదగీతాలను పాడి అలరించేది. కొత్తతరానికి అవి కొత్త పాటలు, పాతతరానికి అవి మళ్లీ గుర్తు చేసుకునే మధురమైన పాటలు. ఎక్కడికైనా బస్‌లోనే వెళ్లేది. ఎంత రాత్రయినా తల్లిదండ్రులు తన కోసం బస్‌స్టాప్‌లో ఎదురు చూసేవారు. ఒకవైపు షాజియా గానమాధుర్యానికి అబ్బురపడి మెచ్చుకునేవాళ్లతో పాటు, మరోవైపు ‘వేదికలు ఎక్కి పాడడం ఏమిటి. ఊరూరూ తిరగడం ఏమిటీ’ అని విమర్శించేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. బెదిరింపులు కూడా వచ్చాయి. ఆ రోజులన్నీ తనకు నిద్రలేని రాత్రులే. ఈ వెక్కిరింపులు, బెదిరింపులను తట్టుకోవడం తన వల్ల కాదనుకొని ఒకానొక సమయంలో ‘పాట’కు శాశ్వతంగా దూరంగా జరగాలని అనుకుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు, సోదరుడు ధైర్యం చెప్పారు. తనను పాటకు మరింత దగ్గర చేశారు. ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎన్నెన్నో దేశాల్లో తన పాటల అమృతాన్ని పంచింది షాజియ. నసీమ్ అక్తర్ మెమోరియల్ అవార్డ్, బక్షీ మెమోరియల్ కమిటీ అవార్డ్, సంగీత్ నాటక్ అకాడమీ... లాంటి ఎన్నో అవార్డ్లు అందుకున్న షాజియ సూఫీగీతాలతో పాటు హిందూ భక్తిగీతాలను మధురంగా ఆలపించడంలో అద్భుతం అనిపించుకుంది. 2014లో తండ్రి చనిపోవడంతో షాజియ గొంతులో దుఃఖం తప్ప ఏమీ లేకుండా పోయింది. అవి తనకు చీకటి రోజులు. అదేసమయంలో తండ్రి మాట ‘నువ్వు పాట ఎప్పుడూ ఆపవద్దు’ గుర్తుకు వచ్చి మళ్లీ పాడటం మొదలుపెట్టింది. తన పాట ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చింది. షాజియాను ఆదర్శంగా తీసుకొని ఈ తరం యువతులు సంగీతరంగంలో రాణిస్తున్నారు. ‘ఏ రంగంలో అయినా కష్టపడడం తప్ప విజయానికి దగ్గరి దారి అనేది లేదు’ అంటున్న షాజియా కష్టపడే తత్వానికి ఆత్మస్థైర్యాన్ని కూడా జోడించింది. -
నిధి కోసం కన్నబిడ్డను హతమార్చిన దుర్మార్గుడు
స్నేహితులతో కలిసి దారుణం ఆరుగురి అరెస్ట్ గుండెపోటుతో ప్రధాన నిందితుడి మృతి చిన్నారి మొండెం, తల నరికి హత్య బెంగళూరు, న్యూస్‌లైన్ : నిధి కోసం కన్న బిడ్డను స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన గుల్బర్గా జిల్లా ఫిరోజ్‌బాద్ గ్రామంలో జరిగింది. షాజియా (18 నెలలు) అనే చిన్నారి మొండెం, తల, చేతులు నరికి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుల్బర్గాకు చెందిన ముషాక్ (39)ను పోలీసులు విచారణ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. గత నెల 19న జరిగిన సంఘటన వివరాలు... ఫిరోజ్‌బాద్‌లో నివాసముంటున్న శంషాద్‌కు షాజియా అనే ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉంటే శంషాద్ స్నేహితుడు ముషాక్. గుల్బర్గాకు చెందిన ముషాక్ నిధులు ఉన్నాయంటూ పలువురిని మోసగిస్తూ ఉంటాడు. గతనెల ముషాక్, శంషాద్ ఇంటికి వెళ్లాడు. ఓ చిన్నారిని బలి ఇస్తే రూ. కోట్ల విలువైన నిధి లభిస్తుందని శంషాద్‌ను నమ్మించాడు. దీంతో శంషాద్ అతని మాయమాటలు విని గతనెల 19న కుమారుడు షాజియాను తీసుకుని స్నేహితులతో కలిసి ఓ నిర్జన ప్రదేశంలోకి వెళ్లి దారుణంగా హత్య చేశారు. అదే నెల 21న షాజియా కనపడటం లేదని శంషాద్ సహ కుటుంబ సభ్యులు పరహతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేశారు. అదే నెల 26న గ్రామ సమీపంలో బాలుడి చేతులు, మొడం పోలీసులు గుర్తించారు. కేసు విచారణ వేగవంతం చేసిన పోలీసులు శుక్రవారం రాత్రి షాజియా తండ్రి శంషాద్, ముషాక్ సహ ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముషాక్ను విచారణ చేస్తుండగా అతను పోలీసుల ఎదుటే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతడిని హుటాహుటిన గుల్బర్గాలోని బసవేశ్వర ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారని శనివారం పోలీసులు తెలిపారు. నిధుల ఆశతో చిన్నారిని హత్య చేసినట్లు శంషాద్ (బాలుడి తండ్రి)తో సహ ఐదుగురు నేరం అంగీకరించారని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.